ప్రముఖ రచయిత ఎం.డి. సౌజన్య ఇకలేరు

నివాళి

ప్రముఖ రచయిత ఎం.డి. సౌజన్య (76) జూలై22న తుదిశ్వాస విడిచారు. ఆయన అసలు పేరు మహమ్మద్‌ నఫీజుద్దీన్‌. ఎం.డి.సౌజన్య కలం పేరుతో సాహితీప్రపంచానికి వీరు చిరపరిచితులు. గుంటూరు జిల్లా తెనాలి కి చెందిన వీరు మే 25, 1945న జన్మించారు. భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తెనాలిలో వి.ఎస్‌.ఆర్‌ అండ్‌ ఎన్‌.వి.ఆర్‌. కళాశాల ఆంగ్ల శాఖాధిపతిగా, వైస్‌-ప్రిన్సిపాల్‌ పనిచేసారు. 'కనకపు సింహాసనం', 'ధర్మ సంరక్షణార్థం', 'దేవుడూ నీకు దిక్కెవరు', 'శుత్రుశేషం', 'పరిహారం',
'కళ్ళు తెరవండి', 'దేశం కోసం', 'గురుదేవోభవ', 'అల్లిబిల్లి అప్పారావు' తదితర నాటకాలు కళాశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడే రాసారు. ఆ కళాశాలలోనే విద్యార్థిగా ఉంటూ ప్రముఖ హాస్యనటుడు ఏ.వి.ఎస్‌ వీరి నాటకాలలో నటించి అనేక బహుమతులు పొందారు. ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, స్వాతి, ఆంధ్రప్రభ వంటి ప్రముఖ వారపత్రికలలో వీరి అనేక నవలలు ప్రచురితమైనాయి. విముక్తి, విధి విన్యాసాలు, కావ్యనాయిక, స్వప్న తరంగాలు, కలలు అలలు, ఈ చరిత్ర ఎవరు వ్రాస్తారో, ఆపదలో అనురాధ, జాదూనగర్‌, మృత్యులోయ, క్షణక్షణం మృత్యు నీడలో, ఈ నేరం ఎవరిది, మాయాబజార్‌, ఓ నటి కథ, బలికోరిన ప్రేమ, మరో ధరిత్రి, త్రికాల్‌ తదితర 20 నవలలకు పైగా రాసారు. వీటిలో స్వప్న తరంగాలు, ఓ నటి కథ, ఈ చరిత్ర ఎవరు వ్రాస్తారో నవలలు కన్నడ, హిందీ భాషల్లోకి అనువాదం అయ్యాయి.
విద్యార్థుల కోసం వ్యాససుధ, నమ్మలేని నిజాలు, చరిత్ర పురుషులు, చారిత్రక ఘట్టాలు, ప్రపంచ అద్భుతాలు, రాబిన్‌సన్‌ క్రూసో అనువాద గ్రంథం, బాలల జానపద నవల రాక్షస ద్వీపం, ఇంగ్లీషు వ్యాకరణ పుస్తకాలు వంటివి రాశారు. ప్రముఖుల వ్యాసాలు, నవరసాల తెలుగు హాస్యం, హాస్యవల్లరి, మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు, దాదాపు 20 ఆంగ్ల వ్యాకరణ గ్రంథాలు రాశారు. చందమామ, బాలజ్యోతి, బాలమిత్ర, బాలభారతి, బొమ్మరిల్లు వంటి బాలల పత్రికల్లో వందకు పైచిలుకు కథలు వీరివి ప్రచురించబడ్డాయి. 1970 దశకంలోనే నఫీజుద్దీన్‌ మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పాత్రల ద్వారా తన నవలల్లో ప్రస్తావించారు. లైంగిక వేధింపులు, ఫైనాన్స్‌ పేరుతో మహిళలను ఉచ్చులో ఇరికించటం, సినిమాలు, నాటకాలు పేరుతో లైంగికంగా వేధించటం, పేదరికంలో మగ్గుతున్న మహిళలను వృద్ధులకు ఇచ్చి పెళ్ళిచేయటం వంటి సమస్యలను నఫీజుద్దీన్‌ కథాంశాలుగా తీసుకొని నవలలు రాశారు.