కలల తీరం

పద్మావతి రాంభక్త
99663 07777

రాత్రి నీడొకటి
నా స్వప్నవృక్షంపై పక్షిలా వాలింది
నిజమనే భ్రమ చుట్టేసినపుడు
ఉధృతమైన చీకటి సముద్రం కౌగిలిస్తూ
చెక్కిళ్ళపై కన్నీరు గడ్డకట్టింది
రెప్పలు మూసిన గాఢ నిదుర నన్నావహించగానే
కల నీడకూ నాకూ నడుమ
సంభాషణా చిగురులు తొడిగింది!
నీడ గుండెలో
సాలెగూడులా అల్లుకున్న ఒంటరితనం ముల్లై గుచ్చింది
ఆకాశానికి ఎగసిన నీడ
నన్ను పలకరించడానికి
స్వప్నమై ఎందుకు వచ్చిందో
ఇప్పటికీ అంతుబట్టని రహస్యమే!

బహుశా ఉదయపు ఊహల్లో
నీడ తలపు తలుపును తట్టి ఉంటాను
గతపు పొరలను ఎవరి ముందో ఒలిచి ఉంటాను
తీరని కోరికలేవో విన్నవించుకోమని
నీడను బలవంతపెట్టాయో ఏమో

కలల పల్లకీ ఒక్కోసారి వింత లోకాలకు తీసుకెళ్ళి
చిత్ర విచిత్రాలను చూపిస్తుంది
అంతరంగపు ఆలోచనలు అస్పష్ట మేఘాలై
కునుకు పచ్చికపై జల్లులుజల్లులుగా కురిసిపోతుంటాయి
అయినా కలల తీరంలో
కాళ్ళు తడుపుకోకుండా
నిదురను ఆహ్వానించడం ఎలా సాధ్యం?

కలల అలలపై తెప్పలా తేలుతుంటే
మెలకువ స్పర్శ కలను పగలగొట్టింది
గాఢ నిదుర రెక్కలల్లారుస్తూ ఎటో ఎగిరిపోయింది
గది వెలుతురు చీరతో మెరుపుతీగలా దర్శనమిచ్చింది!
కలల నీడ ఇప్పటికీ దోబూచులాడుతూ
వెంటాడుతూనే ఉంది!