సామాజిక కవితా పరిమళం 'మా ఊరు మట్టి'

పిల్లా తిరుపతిరావు
70951 84846
మానవునిలో సకల మౌఢ్యాలను పారద్రోలి సామాజిక విజ్ఞానాన్ని పెంపొందించేలా చేసేదే నిజమైన కవిత్వం. కవిత్వానికి సామాజిక శ్రేయస్సు అనే లక్ష్యమే లేకపోతే, అది ఎందుకూ కొరగాని కవిత్వమని అనవచ్చు. సామాజిక కవిత్వాన్ని సృజనచేసే కవులు సిక్కోలు సీమకు కొత్తేమీ కాదు. ఎందరో మహాకవులు తమ సామాజిక కవితా జల్లులతో ఈ నేలను పునీతం చేసారు. వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని మానవీయత, సామాజికత, వాస్తవికత అనే ప్రధాన వస్తువులతో నింపిన కవిత్వాన్ని సృష్టిస్తున్న సిక్కోలుకు చెందిన మరో కవి 'పొన్నాడ వరాహ నరసింహులు' గారు. సుదీర్ఘకాలంగా ఉపాధ్యాయునిగా పనిచేసిన అనుభవాలు, ఆ అనుభవాల్లోంచి నేర్చుకున్న పాఠాలు, జనబాహుళ్యంతో నిత్యమూ తనకున్న సంబంధాలు, ఆ సంబంధాలతో ఇమిడి ఉన్న వివిధ పరిశీలనలు కలబోసి కవిత్వం రాయటం నరసింహులుకు కొట్టిన పిండి. ఈ క్రమంలోనే 'మా ఊరుమట్టి' అనే కవితా సంపుటిని ఇటీవల ఆవిష్కరించు కున్నారు. ఈ సంపుటిలో 52 కవితలున్నాయి. అవి వివిధ పత్రికల్లో ప్రచురితమైనవే. వాటిలో కొన్ని మేలి ముత్యాల్లాంటి కవితలు ఉదహరిస్తూ సమీక్షించుకుందాం.
ఈ సంపుటిలో మొదటి కవిత 'చందమామ'. ఈ కవితలో కవి ఇలా ఆక్రోశిస్తాడు. ''కోట్లాధీశుడైన- కటిక దరిద్రుడైన/ బడుగు బలహీనులైన-బలవంతులైన/ ప్రేయసీ ప్రియులైన-విరహబాధితులైన/ సంస్కారవంతులైన-సంస్కారహీనులైన/ విజ్ఞానులైన-జ్ఞాన శూన్యులైన/ నీకు అందరూ సమానమే'' అని ప్రకృతిలో భాగమైన చందమామ తన చల్లని వెన్నెలను వర్గదృష్టి లేకుండా సమానంగా పంచుతుందంటాడు. అయితే ఈ ప్రపంచీకరణ మాయాజాలంలో నిరంతరమూ కొట్టుమిట్టాడుతున్న జనం ఎంతమంది కౌముదీ కాంతులలో సేద తీరుతున్నారు? ఎంతమంది ప్రజలు ప్రకృతిలోని రమణీయతను ఆస్వాదిస్తున్నారు? అనేది మాత్రం సంశయాత్మకమే. 14వ శతాబ్దంలోని కవి అన్నమయ్య తన 'బ్రహ్మమొక్కటే- పర బ్రహ్మమొక్కటే' అనే కీర్తనలో నిద్ర, నేల, ఎండ మొదలగు ప్రాకృతిక పదార్థాలు రాజు - పేద, అగ్ర - నిమ్న అనే వివక్ష చూపవని అంటారు. ఇది ప్రకృతికి గల సహజసిద్ధ లక్షణమని వివరిస్తారు. ఇది నిజమే కానీ, నేటి జనం ఆ ప్రకృతి ఒడిలో సేదతీరే తీరిక లేక అనారోగ్యాలను కొని తెచ్చుకొని జీవనం సాగిస్తూ ఉండడం దయనీయం.
కవి 'క్రమభంగం' అనే కవితలో పర్యావరణ వినాశనానికి గల కారణాలను వెలికి తీస్తారు. 'రుతు క్రమం తప్పినట్లుంది/ ప్రకృతి గతి తప్పినట్లుంది/ అడవులను తుదముట్టిస్తూ/ పర్యావరణను పరిరక్షించనందుకు/ భూగోళమంతా కాంక్రీట్‌ మయం చేస్తున్నందుకు/ పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించనందుకు'' అని నిష్టూరంగా పలుకుతాడు. ఈ కాలుష్యానికి కారణభూతులు ఎవరు? వారిని అదుపు చేయాల్సిన బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నలు మనలో ఉదయిస్తాయి. ప్రజా చైతన్యం తీసుకురావాల్సిన ప్రభుత్వాలే మిన్నకుండా ఉంటే, కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించాల్సిన రాజ్యమే మీనమేషాలు లెక్కపెడుతుంటే, సామాజిక ప్రగతి ఏ రకంగా సాధించగలం? అని కవి పాలకుల తీరుని ప్రశ్నిస్తారు. అంతేకాదు కార్పొరేట్‌ వర్గాలు తమ లాభాల కోసం విచ్చలవిడిగా అణు ధార్మికతను, పలు విష వాయువులను వెదజల్లే పరిశ్రమలను స్థాపించడం, అలా నెలకొల్పే వారికి సర్వ విధాలా సహకరించే రాజ్యం యొక్క ద్వంద్వ వైఖరిని కవి ఈ కవితలో తూర్పారబడతాడు.
'వచ్చావా! నేస్తం వచ్చావా?' అనేక కవితలో ఉద్యమకారుని ఆగమనాన్ని స్వాగతిస్తాడు కవన కార్మికుడు. ''నీవొక ఉద్యమ గ్రంథం/ అది గత తరాల చరిత్రకాధారం/ ఎన్ని ఉద్యమ కథలు, ఉత్తమ కతలు చెప్పావు?/ ఎన్ని పోరాటాలు నిన్ను రూపుదిద్దాయి/ పోరాటాలతో రాటుదేలిన నీ అనుభవాలు/ మా జీవన పోరాటాలకు పాఠాలు'' నేడు సామాజిక ఉద్యమాలు సన్నగిల్లుతున్న తరుణంలో... ఓ పోరాట వీరుడా! ఓ ఉద్యమకారుడా! నీ అనుభవాలు, నీ ఎత్తుగడలు, నీ పోరాట క్రమాలు మళ్లీ అవసరమైనవి. నేటి ప్రజా సమూహాలు ఆ దిశగా పయనిస్తే కానీ, సగటు మనిషికి నిలువనీడ దొరకదు. కాదు పోదంటే, కొన్నాళ్లకు మనిషి మనుగడకే ప్రమాదం వాటిల్లుతుంది. ప్రపంచీకరణలో భాగంగా సామ్రాజ్యవాదుల కోరల్లో చిక్కుకున్న మానవుణ్ణి పునఃప్రతిష్ట చేసేందుకు నీ ఉద్యమ కార్యాచరణే శరణ్యం.. అని ఎంతో ఆశావహ దృక్పథంతో కవి ఉద్యమాల అవసరాన్ని నొక్కివక్కాణిస్తాడు. ''ఎనభైళ్ళలో కూడా ఇరవైల్లా/ ఇప్పటికీ ఉద్యమ పిడికిలి సడలించనంటావు/ అందుకే నీవంటే నాకుత్తేజం/ నీతో సంభాషణ నాకొక ఉద్యమ గ్రంథ పఠనం'' అని గత కాలపు ఉద్యమాలను తలచుకుంటూ, ఆ పోరాట యోధులపై గౌరవాన్ని చాటుతూ, వర్తమానంలో పోరాటాల ఆవశ్యకతను గుర్తు చేస్తాడు కవి.
'ప్రశ్న' అనే కవితలో ''ప్రశ్న ప్రగతికి మూలం/ ప్రశ్న సృష్టి వికాసానికి దోహదం/ ఏమిటి? ఎందుకు? ఎలా?/ ప్రశ్నలు లేకుంటే, విజ్ఞానశాస్త్ర వికాసం లేదు/ జన్మ రహస్యాన్ని, జీవోద్భవాన్ని ఛేదించింది/ అయినా ఈ అసమానతలకు హేతువేమిటి? అని ప్రశ్న యొక్క ఔన్నత్యాన్ని, అవసరాన్ని ప్రబోధిస్తాడు కవి. శాస్త్ర విజ్ఞానాన్ని అందుకోవటానికి ప్రశ్న తార్కిక శక్తినిస్తుంది. ఆ తార్కికశక్తే నేటి నవీన యుగపు అవసరాలను తీర్చగలదు. అయితే నేడు కొంతమంది ఆ గతితార్కిక నేపథ్యాన్ని మరచిపోయి మూఢత్వాన్ని, ఛాందస వాదాన్ని బుర్రలో ఎక్కించుకుని ఆధిపత్య భావజాలం మరింత ప్రబలేలా చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం.
'ఊరు ఊరులా లేదిపుడు' అనే కవితలో 'ఇప్పుడూ ఊరు ఊరులా లేదు/ చిధ్రమైన మట్టి గోడలా ఉంది/ చిల్లులు పడ్డ తాటాకు గిడుగులా ఉంది'' పట్టణీకరణ పేరిట సాగుతున్న విధ్వంసకర అభివృద్ధి నేటి గ్రామీణ జీవనాన్ని ఎలా అతలాకుతలం చేస్తోందో విశదీకరిస్తాడు కవి. ''ఊరులో బతుకే ప్రశ్నార్థకమవుతుంది/ డబ్బు గబ్బు ఊబిలో/ పీకల లోతు కూరుకుపోయింది'' ధనానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ, ఆత్మీయులకు వారి అనుబంధాలకు దూరమవుతూ, ప్రేమపూర్వక స్నేహ సంబంధాలు విడిచిపెడుతూ, నేడు ముందుకు పోతున్న జనం ప్రవృత్తిని నిరసిస్తాడు కవి. అవినీతికి అక్రమాలకు నిలయమైన నేటి పల్లెల్లో, నీతిని నిజాయితీని ఎప్పటిలాగానే పాదుకొల్పమని సూచిస్తాడు కవి. అంటే కలుషిత వాతావరణంలో కూరుకుపోయిన మనిషి మరలా స్వేచ్ఛగా, హాయిగా పల్లెల నీడపట్టున సేదతీరుతూ జీవనం సాగించాలని కోరుకుంటాడు కవి. 'బువ్వ ముఖ్యం' కవితలో ఏడాది కాలంగా ఉత్తర భారత రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ఉత్తేజంగా ఉదహరిస్తాడు. సంపద సృష్టి కారకులు కర్షకులు. అలాంటి సైనికులు పిడికెడు మెతుకుల కోసం, బుక్కెడు బువ్వ కోసం అలమటిస్తూ జీవించడాన్ని స్పృశిస్తాడు కవి. పదిమందికి అన్నం పెట్టే రైతన్న నేడు తిండిలేక నరకయాతన పడడాన్ని ఏకరువు పెడతాడు. దీనికి కారణం ఎవరు? ప్రభుత్వం కాదా? రాజ్యం విధానాలు కావా? అని ప్రశ్నిస్తాడు. ''దుక్కి దున్నే రైతులు/ మొక్కనాటే కూలన్న లొక్కటై/ లాంగ్‌ మార్చిని తలపించే/ అన్నదాతల పదఘట్టనలు/ యావత్తు భారతదేశాన్నే కుదిపేసింది/ వెల్లువలా ఉప్పొంగి/ ముంబాయి నగరాన్ని ముంచేసింది'' అంటూ గతంలో జరిగిన 'ముంబై లాంగ్‌ మార్చ్‌'ను నొక్కి చెబుతాడు కవి. అలా నేటి రైతు ఉద్యమం కూడా రూపు దాల్చుకోవాలని ఆకాంక్షిస్తాడు. దానికోసం కర్షకులు, కార్మికులు, కులవృత్తుల వారు, బుద్ధిజీవులు ఏకం కావాలంటాడు. 'బులెట్‌ ట్రైన్‌ బ్యూరోక్రాట్‌ సంస్థలూ కాదు/ బువ్వ ముఖ్యమని నినదించి చాటింది' అంటూ నేటి కర్షకుల పోరాటాన్ని వివరిస్తాడు.
'కాలగమనంలో' కవితలో ''కాలే కడుపుతో యోగా చేయిస్తున్నారు/ జేబులో చిల్లిగవ్వైనా లేకున్నా/ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపిస్తున్నారు/ సాధ్వీల్నీ మానవ హనన కారకుల్నీ/ ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నారు'' అంటూ గత కొంతకాలంగా సాగుతున్న రాజకీయ ధోరణులను ఈ కవి చీదరించుకుంటాడు. జేబులో పైసా లేకపోయినా బ్యాంకుల్లో ఖాతాలు తెరవమంటూ ఒత్తిడి తేవడాన్ని నిరసిస్తాడు. మనుషుల్నీ వారి వేదనల్నీ పట్టించుకోని రాజకీయ నాయకులను చట్టసభలకు ప్రతినిధులుగా మనం పంపించడాన్ని ఆక్షేపిస్తాడు. 'మా ఊరుమట్టి' కవిత శీర్షికనే కవి తన కవితా సంపుటికి పేరుగా పెట్టాడు. ఇందులో కవి తన గ్రామ మట్టి వాసనను గుర్తుకు తెచ్చుకుంటాడు. ఎవరికైనా తన జన్మభూమిలో గడిపిన క్షణాలను అపురూపంగా నెమరు వేసుకోవడం ఇష్టమే కదా! అందుకే కవి ఇలా తన మట్టి మధుర జ్ఞాపకాలను తడుముకుంటాడు. ''మట్టి మట్టి మట్టి/ మా మడి మట్టి మా చెరువు మట్టి/ మా గెడ్డ మట్టి మా గుడ్డె మట్టి/ మా పెంట మట్టి మా పొలం మట్టి/ మరపురాని అనుభూతులను మట్టి/ తాతలనాటి తరతరాల మట్టి/ ఎన్నటికీ సువాసనలు వీడని మట్టి/ నన్నీ స్థితికి చేర్చిన మట్టి మా ఊరు మట్టి'' ఎన్నో అష్టకష్టాలు పడి, తన తల్లిదండ్రులు తనకీ ఉన్నత జీవితం ఇచ్చారనీ, తన గురువుల ప్రేమపూర్వక ఆదరణ ఎంతో దొరికిందనీ, ఎన్నో మానవ సంబంధాలకు తాను బందీనయ్యాననీ, అవన్నీ కలసి తన ఊరి మట్టిలో నిగూఢంగా ఉన్నాయనీ, తనకెప్పుడూ అవి గుర్తుంటాయనీ చెబుతూ కవి ఆనందపరవశుడవుతాడు. ఈ కవితా సంపుటికి మా 'ఊరుమట్టి' అని నామకరణం చేయడాన్ని లోతుగా పరిశీలిస్తే, ఆ పదం అర్థంలో ఋణాత్మక భావమేదో పొడచూపుతున్నట్లు అనిపిస్తున్నది. అదే 'మా ఊరిమట్టి' అని శీర్షిక పెట్టి ఉంటే, ధనాత్మక భావనేదో కచ్చితంగా స్ఫురణకు రాగలదని చెప్పొచ్చు. తెలుగు భాషా పదాల పొందికలో గుణింతాల ప్రాధాన్యత అంత్యంతావశ్యకం. ఏమాత్రం అటుఇటుగా పొరపాటు జరిగినా అర్ధం పూర్తిగా మారిపోతుంది. 'భావనా బలం పుష్కలంగా ఉన్న ఈ కవి శ్రద్ధగా కవిత్వాన్ని అధ్యయనం చేస్తే, వచనానికీ- కవిత్వానికీ మధ్య గల తేడాని నిశితంగా పరిశీలించి కవితా సేద్యం చేస్తే, రేపు యివే కవితల్ని తిరిగి రాయాలనుకుంటే, అప్పుడవి మరింత పదును తేలుతాయి'' అన్న ప్రముఖ కవి గంటేడ గౌరు నాయుడు గారి పీఠికలో పలుకులు యదార్థమనే భావన పాఠకులకు కూడా కచ్చితంగా స్ఫురిస్తుంది. మంచి సామాజిక కవిత్వాన్ని అందించిన 'పొన్నాడ' వారికి శుభాభినందనలు.