కె.ఉషాబాల
'కథ'ను రసవత్తరంగా ఎలా రాయాలి? మంచి కథ అంటే ఏమిటి? ఈ అంశాలు కథా రచన ప్రారంభంలో బహుశా ఏ రచయిత తనను తాను చర్చించుకోడు. క్రమేపి కధా రచనలో అనుభవం, అనుభూతి, గాఢత వంటివి ఏర్పరుచుకొని వస్తువు, నేపథ్యం, పాత్రలు, అనుభవాలు, అనుభూతి వంటి వాటిని అర్ధం చేసుకుంటాడు. ఓ గొప్ప ఆలోచనలో కథను ప్రారంభించాలని అనుకొన్నా, చివరకు అది పేలవంగా తయారవచ్చు కారణం - ఆలోచనలోని బలం, సాంద్రత 'కథా గమనం'కు ఉపయోగపడే పాత్రలు, నేపథ్యం, వస్తువు, భాష వంటి వాటి వద్ద తేలిపోతాయి. ఎందరో ప్రసిద్ధులు ఒక ఆలోచనకు సంవత్సరాల తరబడి 'చిత్రిక' పట్టి కథారూపంగా తీర్చిదిద్దిన సంఘటనలున్నాయి. కథగా ప్రారంభమైంది 'నవల'గా మారిన సందర్భాలు ఉన్నాయి. రా.వి.శాస్త్రి గారి 'మూడు కథల బంగారం' 'ఇల్లు' వంటివి ఇందుకు ఉదాహరణ. పూర్వ కవులు, పాశ్చాత్యులు కూడా కథలను కావ్యాలుగా తీర్చిదిద్దే కృషి చేసారు. చెకోవ్, ఓహెన్రీ, మొపాసా వంటి వారి కథలు ఇందుకు ఓ గొప్ప ఉదాహరణ. వారి కథల్లో 'మెరుపులు' ఎలా సాధ్యమయ్యాయి? కాష్కా కథల్లోని 'గాఢత' ఎక్కువ మందికి అర్ధం కాదు. 'అబ్సర్డిటీ' గా పెర్కొనవారు ఉన్నారు. కారణం - పాత్రలు వాటి మధ్య ఓ 'అంతు చిక్కని లోతైన' ఆలోచనా విధానం, భాష వంటివి ఇందుకు ప్రత్యేకంగా చెప్పకోవచ్చు. అనుభవాలు, అనుభూతులుకు తగిన భాగస్వాయ్య అవసరం. మామ్, శరత్, చలం వంటి వారి పాత్రలు - వాటి భాషలను పరిశీలిస్తే 'ఒక స్థాయి' లో ఉంటాయి. వారి కథా వస్తులు తగిన పాత్రలతోనే ఈ 'విశేషం' సాధించారు. అసలు ఏ భాషా ఎటువంటి భాష అనేది సమస్య కాదు.