వజ్ర సంకల్పం

బంగార్రాజు కంఠ
85003 50464

ఆర్యగాలి కల్పించి
వినిపించిన కథలు వినీ వినీ
అప్పనంగా కడుపు నిండాలని చూస్తుందీ దేశం
అమ్మకడుపు నుండి కాక
బ్రహ్మ అంగాల నుండే
పుట్టుకలు మొదలౌతాయనే భ్రమల్లో
ఇంకా బతుకుతుంది పాపం!

డెభ్బై అయిదేళ్ళ స్వతంత్రంలో
ఏమి ఒరిగిందని ఎవర్ని అడుగుతున్నావ్‌?
ఒకవేళ ఏమీ ఒరగలేదంటే
కచ్చితంగా అది వందకోట్ల ఉత్తర కుమారుల ప్రగల్భం
ఒక్కొక్క భారతీయుడు
ఓటమి కొయ్యకు ఉరిపోసుకు వేలాడడం

స్వతంత్రం ఒక అద్భుత దీపం కాదు
స్వతంత్రం ఒక సొంత ఆలోచన
స్వతంత్రం ప్రవరాఖ్యుడి పాదాలకు పూసిన లేపనం కాదు
స్వతంత్రం మనకు మనం
ఎదగడానికి దొరికిన ఒక ఊతం

నువ్వు నినదించాలే గానీ
దిక్కులు సిద్ధంగా వున్నాయి నీతో కలిసి పిక్కటిల్లడానికి
నువ్వు మంచిని ఎదజల్లాలే గానీ
మట్టెప్పుడూ కాసుక్కుర్చుంటుంది
మానవత్వం మొలిపించడానికి
నువ్వు పోరాడాలే గానీ
ప్రకృతి పొత్తి కడుపులో చురకత్తులు దాచింది
లక్ష్యాలను చీల్చి చెండాడడానికి ..
నేల నేలంతా చెద పురుగులే
గింజ మొలకెత్తడం మానేస్తుందా!?