వర్గ వైరుధ్యం సృష్టించిన నెత్తురు నది

వి.రెడ్డెప్ప రెడ్డి
94400 44922
తమిళ మూలం : కురితిప్పునాల్‌,
రచయిత : ఇందిరా పార్థసారథి,
ఆంగ్లానువాదం : ఇందిరా పార్థసారథి
తెలుగు అనువాదం : రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
2020 ఆక్స్‌పామ్‌ లెక్క ప్రకారం.. మన దేశంలో 42.5 శాతం సంపద ఒక శాతం సంపన్నుల వద్ద ఉంది. 50 శాతం జనాభా వద్ద 2.8 శాతం సంపద మాత్రమే ఉంది. ఈ అసమానతలు ఇంకా పెరిగితే దేశం ఏమౌతుంది? బాంబులతో నింపిన జీపును ముంబాయిలో వీధి చివరన నిలిపి, ఆసియాలోనే అత్యంత సంపన్నుడిని ఒక సర్కిల్‌ ఇనస్పెక్టర్‌ భయపెట్టే స్థాయికి దేశం ఎదిగింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశం ఇంకెంత ఎదిగేనో?
వ్యవసాయాధారిత జీవిత నేపథ్యంలో భూములు లేని కుటుంబాలకు సొంత పని ఉండదు. మరోచోట పని దొరకదు. అప్పు పుట్టదు. కడుపు నింపుకునే పరిస్థితి ఉండదు. మనిషిగా గుర్తింపు కనీస స్థాయికి పడిపోయి ఉంటుంది. భూములు లేని పేదవాళ్ళ పరిస్థితులు ఇంత దయనీయంగా ఉంటే భూములు ఉండి కూడా ఏ మాత్రం మెరుగ్గా లేని వారూ ఈ దేశంలో తక్కువేమీ కాదు. భారతీయ గ్రామాల్లో 10 శాతం ఉన్నత వర్గాలు 60 శాతం భూమి విలువపై హక్కు కలిగి ఉండటం ఒక పార్శ్వమైతే, ఆర్థిక నిచ్చెన అడుగునే మిగిలిన 50 శాతం గ్రామీణులు కేవలం 3 శాతం భూమి విలువకు సొంతదారులు కావడం మరో పార్శ్వం. భూసంస్కరణ చట్టాల్లోని లొసుగులు ఇందుకు కారణమన్నది అసలు నిజాన్ని దాచడమే!
గ్రామాల్లో ఆర్థిక అసమానతలకు కొలమానం కుటుంబాల మధ్య భూవిస్తీర్ణంలో తేడాలు సూచిస్తాయని చెప్పుకునే రోజులు పోయాయి. భూమి విస్తీర్ణంపై కాక, భూమి విలువపై ఆధారపడి అసమానతలు లెక్కించాల్సిన సందర్భం ఇది. వాణిజ్య పంటలకు అనువైన, నీటి వసతి కలిగిన సారవంతమైన భూములు ఎవరి చేతుల్లో ఉంటే వారి ఆర్థిక స్థాయి లేదా ఆర్థిక విలువ, ప్రభుత్వంచే పేదలకివ్వబడిన డి ఫార్మ్‌ పట్టాభూములు, డొంక పోరంబోకులు, పోడు భూముల కంటే కనీసం పదుల రెట్లు అధికమన్నది నిజం. భూమి విలువలో అంతర్లీనంగా ఉన్న భారీ వ్యత్యాసాలను బయట ప్రపంచానికి దాయడంలో పాలకులు విఫలమయ్యారనడానికి వ్యవసాయరంగంలోకి పారిశ్రామికవేత్తల ప్రవేశమే నిదర్శనం. భూమి ద్వారా సంక్రమించిన అసమానతలు ఆర్థిక అంశాలకే పరిమితం కాలేదు. భూమి హక్కులో అసమానతలు, ఆర్థిక, రాజకీయ, సామాజిక, ప్రాదేశిక, పర్యావరణ అసమానతలకు కారణమన్నది జీర్ణించుకోరాని నిజం. వీటికితోడు ఎన్నో తరాలుగా పేరుకుపోయిన కుల అహంకారం కొందరిది, అన్ని తరాలుగాను ఆ అహంకారానికి తలొంచిన దైన్యం ఇంకొందరిది. ఈ అంశాలే ఉన్నవారికి లేనివారికి మధ్య ద్వేష భావాలకు మూలం. గ్రామ ప్రాంతాల్లో అడుగున మిగిలిన దళితుల పట్ల ఉన్నత వర్గాల దమన నీతి ఈ ద్వేష భావాల రూపురేఖలతో నిత్యం బయటపడుతూనే ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రావణ కాష్టాలుగా ముద్రపడ్డ కారంచేడు, టి.చుండూరు, పాదిరికుప్పం సంఘటనలు శూద్రులలో ఉన్నత వర్గాలు, దళితుల మధ్య ద్వేష స్వరూపానికి ప్రతీకలు. తమిళనాడు తెవర్స్‌, పల్లార్స్‌ మధ్య ఘర్షణలు వెనక బడ్డ కులస్తులకు దళితులతో సయోధ్య మిధ్యేనని చెప్పడానికి సాక్షీభూతాలు. ఉత్తరాదిన పశువులను కబేళాలకు తోలు తున్నారనే నెపంతో దళితులను పశువులకంటే హీనంగా శిక్షించిన ఉన్మాదులకు వ్యవస్థల నుంచి ఇంకా రక్షణ దొరకడం జీర్ణించు కోలేని నిజాలు. భారత శిక్షాస్మ ృతి అటువంటి మృగతత్వ వాదులను శిక్షించడంలో తొందర పడకపోవడం మానవ మాత్రులకు ఆక్షేపణీయం కాకపోదు. ఇటువంటి వ్యవస్థలు గ్రామీణ జీవితాలను నిర్దేశిస్తుండడంతో నెత్తురు నదుల ప్రమాదం పొంచి ఉంటాయనేది కొంగులో నిప్పు దాచుకోవడం లాంటిదే.
నెత్తురు నది ఏ దేశంలోనూ, ఏ వ్యవస్థలోనూ పారకూడదని విజ్ఞుల అభిమతం. తాత్కాలికంగా అలాంటి నది రూపుదిద్దు కున్నా సజీవరూపంలో పారి జనసముద్రంలో కలిసిపోవాలి. దానికో ముగింపు ఉండాలి. నెత్తురునది ఏర్పడి పారకపొతే ఏమవుతుంది? బలిష్టమైన ప్రాణులు నదిని ఆక్రమించు కుంటాయి. నదిలో బతికే బక్క ప్రాణులను ఆహారంగా చేసుకుని బతకడం అలవాటు చేసుకుంటాయి. అయితే బలహీనుడు, బలహీనుడిగానే మిగిలిపోడు. పదిమంది బలహీనులు కలిస్తే ఒక్క బలవంతుణ్ణి మట్టి కరిపించడం సహజ పరిణామమే.
నెత్తురు నదులు ఏర్పడడానికి అవకాశాలు కల్పించే పరిస్థితులు మన దేశంలో సర్వవ్యాప్తం. ఆర్థిక వైకల్యమనదగు అసమానతలు ఒకవైపు, సామాజిక వైకల్యమనదగు కులవివక్ష మరోవైపు, గ్రామీణ ప్రాంతాలను చెట్టుకు వేలాడదీసి తూకం పడుతుంటాయి. చట్టాల అమలులో నిర్లజ్జ, నిర్భీతితో వ్యవహరిస్తూ బలాడ్యుడి వైపు తూకం పెంచుతూ, చట్టాలను కాపాడవలసిన వ్యవస్థలు సామాన్య జీవితాలు అతలాకుతలం కావడంలో దోహదపడుతుంటాయి.
అలాంటి ఒక నెత్తురు నదిలో జీవిస్తూ ఒకరినొకరు హరించివేయాలనే తపనతో పోరాడే బలాడ్యుడు, బలహీనుల మధ్య జీవన పోరాటాన్ని పరిచయం చేస్తుంది 'నెత్తురు నది' నవల. 'మహాప్రస్థానం' యోగ్యతాపత్రం రాస్తూ 'కృష్ణశాస్త్రి తన బాధను అందరిలోనూ పలికిస్తే, శ్రీశ్రీ అందరి బాధనూ తనలో పలికిస్తాడు' అంటాడు చలం. రచయిత బడుగుల బాధను ఈ నవలలో పలికిస్తాడు. 'చివరికి మిగిలేది' ముందుమాటలో బుచ్చిబాబు 'పాశ్చాత్య దేశాల్లో నవల జీవితం మూడు మాసాలుట' అంటాడు. ఆ దేశాల్లో ఓ సమస్యపై నవల వస్తే, ఆ సమస్యపై పరిశోధనలు జరిగి, సమస్యల పరిష్కారం వైపు అడుగులు పడతాయి. కానీ మనదేశంలో నవలల్లో ప్రస్తావించిన అంశాలను పాలకులు పట్టించుకోరు. పరిష్కారాలను వెతకరు. ఎవరైనా పరిష్కారాలు చూపినా తలకెక్కించుకోరు. పరిష్కరించ డంతో ఉపయోగాన్ని గుర్తించరు. ఎందుకంటే ఈ దేశంలో ప్రజలు ప్రజలు కాదు, ఓటర్లు మాత్రమే! అందుకే ఇలాంటి నవలలు మనదేశంలో దశాబ్దాలైనా జీవిస్తాయి.
'మైనా' నవల గురించి శీలా వీర్రాజు, 'ప్రయాణంలో ఏవో రెండు ముఖ్య బిందువులను గుర్తుపెట్టి, ఒక బిందువు వద్ద బయలుదేరి, దారిలో కనిపించే వాటన్నిటినీ కుతూహలంతో చూసి, ఒక్కొక్కసారి కాసేపు నిలబడి, వెనక్కి తిరిగి చూసి, మళ్ళీ కదిలి రెండో బిందువును చేరుకున్నాను' అంటాడు. నవలలో కథకు ఓ ప్రారంభం, ఓ ముగింపు ఉండవంటాడు. ఈ నవల కూడా అంతే. కథకు మొదలు, అంతం దొరకవు. ప్రవహించే నదిలోని వరద ఉధృతిని, ఆ ఉధృతిలో ఎగిసిపడే రాక్షస కెరటాల్ని, కెరటాల సుడిలో పడి కొట్టుకుపోయే సామాన్యుడి జీవన పరిస్థితులను చూపిస్తుంది. సమస్యలకు పరిష్కారాలను ప్రభుత్వ వ్యవస్థల్లో వెతకడం కంటే సమాజంలోనే వెతుక్కోవాలనే ధోరణిని సమర్థిస్తాడు రచయిత.
అనువాదానికి సర్వజనీనమైన నవలను ఎన్నుకోవడం సాహిత్య కళ. ఇందిరా పార్థసారథి గారి 'కురుతిప్పునల్‌' తమిళ నవలను ఎన్నుకుని తన జీవన, సాహిత్య దృక్పథాన్ని చెప్పకనే చెప్పారు రాచపాళెం గారు.
ఇక కథలోకి వస్తే, తన మిత్రుడు గోపాల్‌ని వెతుక్కుంటూ శివ చేసే బస్సు ప్రయాణంతో మొదలవుతుంది. పాఠకుడు బస్సు ప్రయాణంలో భాగమైపోతాడు. ప్రయాణంలోనే తమిళనాడుని శాసించే సినిమాలు, రాజకీయాలు, మత అంశాలపై పాఠకుడు కూడా అవగాహన ఏర్పరుచుకుంటాడు. గ్రామంలో కన్నయ్య నాయుడనే భూస్వామి ఒకవైపు రొమ్ము విరుచుకు నిలబడితే, పేద రైతులు, కూలీల వైపు రామయ్య నిలబడి పోరాడుతుంటాడు. విప్లవ భావజాలాన్ని నమ్మే రామయ్య వైపున్న న్యాయాన్ని నమ్మి ఆ వర్గంలో తాను ఒకడై పోతాడు గోపాల్‌.
ధన బలాన్ని, కుల బలాన్ని, వృత్తిరీత్యా రౌడీలను, చేతిగజ్జికి అలవాటుపడ్డ పోలీసులను, అధికార పార్టీ బలాన్ని, గ్రామంలోని స్త్రీ పురుష సంబంధాలను, చివరకు తల్లి మరణాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకోగలిగిన తెలివితేటలతో పాటు, కామ విశృంఖలత కలిగిన భూస్వామి కన్నయ్య నాయుడు ఒకవైపు ఉంటాడు. ఆకలి, దారిద్య్రం వెంటాడుతున్నా మార్కి ్సస్ట్‌ భావజాలాన్ని నమ్ముకున్న రామయ్య, గోపాల్‌, కనకసభ, సభాసుందరం పేద రైతుల వైపు ఉంటారు. రామయ్యతో పాటు పోరాడే గోపాల్‌కు స్త్రీల విషయంలో బలహీనతలు ఉండటం మరో పార్శ్వం. గోపాల్‌ చేసిన తప్పులను కథలో భాగం చెయ్యడం నిజ జీవిత ప్రతీక.
గ్రామ రైతులు కూలీ విషయంలో న్యాయాన్ని అడిగితే, ఇతర గ్రామాల నుంచి కూలీలను పిలిపించుకుని, ఎదురు తిరిగిన రైతులపై ద్వేషంతో, గ్రామాన్ని తగలబెట్టించి, అందు లోకి స్త్రీలు, పిల్లలను తోసి భూస్వామి తన పంతాన్ని, ధనశక్తిని, పలుకుబడిని నెగ్గించుకుంటాడు. గ్రామస్తుల నెత్తురుతో కూడిన ప్రవాహంలోకి దిగిన గోపాల్‌, పరుశురాముడి లాగా పోరాటం చేస్తానని తీర్మానించుకోవడంతో నవల ముగుస్తుంది.
నేరస్తులనే అనుమానంతో పేదవాళ్లను స్టేషనుకు రమ్మనే పోలీసులు, భూస్వామి నేరస్తుడయినా అతడింటికే వెళ్లి విచారించడం లాంటి జీవిత సత్యాలను ఆవిష్కరించడంలో రచయిత సఫలమయ్యాడు. 'భూముల్ని నది నీళ్ళతో పండిం చడు. దళితుల నెత్తురుతో పండిస్తాడు.','అది సముద్రపు హోరులాగా ఉంది. ఇది చివరి ప్రళయం 'యుగాంత తాండవం'. దిక్కులు పగిలిపోతాయి. ఉరుములు గర్జిస్తాయి. అనంత, బాహిర, విశాల విశ్వంలో అసంఖ్యాక పిశాచాలు పాటలు పాడుతూ నృత్యం చేస్తాయి. సందేహం లేదు.. ఇది భూగోళ నిర్మూలన నృత్యం. సందేహం లేదు. అధికార పిశాచాలు లయబద్ధమైన నిర్మూలన పాటలో భయంకరంగా గర్జిస్తున్నాయి.'లాంటి మాటలు పాఠకుడిని ఉద్వేగానికి లోను చేస్తాయి. ''దేశమంతా విప్లవం వస్తే తప్ప, చట్టాలు మారవు. పరిస్థితులు మారవు.'', ''విప్లవం ఎప్పుడూ ముగిసిపోదు. ముగిసి పోయిందంటే అది విప్లవం కాదు.'', ''సామాజిక విప్లవం వచ్చే ముందు దానిని ఓడించడానికి అవతార సిద్ధాంతం పుట్టింది.'', ''అధికారంలో ఉండేవాళ్ళ చొక్కాలకు లెక్కలేనన్ని జేబులు న్నాయి.'' లాంటి జీవిత సత్యాలు నవల నిండా కనబడతాయి.
అనువాదంలో దొర్లిన ఒకటి రెండు చిన్నతప్పులు కొట్టొచ్చినట్లు కనబడ్డాయి. తంజావూర్‌, తంజావూరు అనే ఊరి పేరు లాగానే, సెమ్మలర్‌, చెమ్మలర్‌ పదాలు, ఉండాడు, ఉన్నాడు అనే పదాలు వేర్వేరు చోట్ల వేర్వేరుగా పొటమరించాయి. 'ఉంటారు'లోని 'ఉ' ఒక లైనులో మిగతా అక్షరాలు మరో లైనులోకి, అలాగే 'పందిళ్ళు', 'రాళ్ళు' పదాల్లో 'ళ' వత్తును తరువాతి లైనులోకి నెట్టిన ముద్రారాక్షసాలు ఉన్నాయి. రాచపాళెం గారు 'ప్రాచీన, నవీన సాహిత్యాలతో సజీవ పరిచయం ఉన్నవాడు.. ప్రామాణిక గ్రంథాలు రాసి అకడమిక్‌ రంగంలో పేరు తెచ్చుకున్నవాడు' అన్న వల్లంపాటి గారి మాటలు అక్షర సత్యాలని ఈ రచనతో మరోసారి ఋజువైంది. ఇంత చక్కటి తెలుగు అనువాదాన్ని కేంద్ర సాహిత్య అకాడెమి ప్రచురించడం హర్షించదగ్గ విషయం. పలుమార్లు చదివి, చదివించదగ్గ నవల 'నెత్తురు నది'. దాచుకోదగ్గది కాదు.