బలిమోడ్ని...

కథ
- దాసరి రామచంద్రరావు9704459373


కరోనా పుణ్యమా అని అందరం ఇంట్లోనే ఉంటున్నాం. ''నాన్నా నేనో కథ రాసాను'' అంటూ, నా చేతిలో కాగితాలు పెట్టాడు, నా ఇరవై ఐదేళ్ళ కొడుకు. ఎప్పుడూ సెల్‌ ఫోనూ, కంప్యుటర్‌, టీవీలు చూస్తూ గడిపేవాడు, కథ రాయడమేమిటా! అని నేను ఆశ్చర్యపోయాను. చదవడం మొదలుపెట్టాను......
అవి దసరా రోజులు.
ఐదు రోజుల్నించి ముసురు. కుండపోత వర్షం. ఎదురింట్లో హడావిడిగా వుంది. రేపటి వ్రతానికి ఏర్పాట్లు చేస్తున్నట్టున్నారు. ఎవెరవరికో ఫోన్లు....ఆ ఇంటి యజమానికి, అధికారిగా ప్రొమోషన్‌ వచ్చి ఆరు నెలలయ్యింది. మొక్కు చెల్లింపుకు ముహూర్తం ఇప్పుడు కుదిరింది. కుదరడం కాదు. నీకు ప్రొమోషన్‌ ఫలానా అప్పుడు వస్తుందని చెప్పిన పంతులుగారే పెట్టారు. ఆయన శ్రీచక్ర పీఠం ప్రధాన అర్చకుడు. వారి చేతులమీదుగానే ఈ వ్రతం జరగాలని ప్రమోషన్‌ పొందిన అధికారి కోరిక. ప్రధాన అర్చకులవారంటే అంతగురి. వారి మాట అధికారికి వేదవాక్కు.
సాయంత్రం నాలుగయ్యింది. వర్షం తెరిపివ్వడం లేదు.
అధికారి కుటుంబసభ్యులంతా పోర్టికోలో ఎదురు చూస్తున్నారు. అనుకున్న వస్తువులు ఏవీ ఇంతవరకూ ఇంటికి చేరలేదు. ఆ ఆందోళన కుటుంబ సభ్యుల్లో కనిపిస్తోంది.
''మీరెలాంటి వాళ్లకి అప్పగించారో ...'' అధికారి భార్య గొంతు కరకుగా వుంది. కసురుకుందో కస్సుమందో.
''వొచ్చెస్తారు.. వొచ్చెస్తారు... వొకటే వర్షం.. రావోద్దా, తేవోద్దా...''
మదువుగా సర్ది చెప్తూ రోడ్డువంక చూసిన అధికారి-
'' అదిగో సుబ్బారావ్‌ ..వచ్చేస్తున్నాడు.'' అని అరిచినంత పనిచేసాడు.
మామిడాకులతోసహా వచ్చిన సుబ్బారావు తడిచి ముద్దయ్యున్నాడు.సైకిల్‌ దిగకుండానే-
''సార్‌ నమస్కారం సార్‌, నమస్కారం సార్‌'' అంటూ సైకిల్‌ కి వున్న మామిడాకులుతీసి గుమ్మంలో పెట్టి అతడక్కడే నిల్చొన్నాడు.
''లోపలికి రావోరు సుబ్బారావ్‌ తడిచిపోతావ్‌'' అన్నాడు అధికారి కనికరంతో.
ఆవిడ మాత్రం ఆకుల్ని ఎగాదిగా చూసింది.
''మంచివి దొరకలేదా? అన్నీ ముడుచుకుపోయున్నాయి. శుభమా అని ....'' అధికారి వైపు కొరకొరా చూసింది.
సుబ్బారావుకి తనవైపే చూసినట్లైంది.
''సార్‌, సార్‌ మంచివి తెస్తాను సర్‌'' అంటూ తడిచిన చేతులతోనే గబగబా ఫోన్‌ తీసాడు.
''...రంగసాయి గారూ నేను సుబ్బారావుని...'' అంటూ ఏదో మాట్లాడి, వచ్చినంత స్పీడుగా తిరిగి సైకిలెక్కి బయలుదేరాడు సుబ్బారావ్‌.
''...ఎప్పుడు తెస్తాడు? ఎప్పుడు కడతాడు? ఏడ్చినట్టేవుంది...ముష్టిముండా వర్షం ఆగట్లేదు. ఉదయం ఆరోగంటకి పంతులుగారోచ్చేస్తానన్నారు....వొక్కక్షణం ఆగరు. అన్నీ రెడీగా వుండాలి...'' అధికారి భార్య గొణుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది.
అధికారి ఏమీ అనలేక రోడ్డు మీదకే దష్టి సారించేడు. వర్షం వల్ల ఏమీ కనబడడం లేదు. బీటెక్‌ పూర్తిచేసిన ఆయన కొడుకు ఇదేమీ పట్టించుకోకుండా సెల్‌ చూసుకుంటున్నాడు. ఇంతలో కారు వచ్చి ఆగింది. డ్రైవర్‌తో మరో వ్యక్తి దిగాడు. తడుస్తూనే- కారు లోపల్నించి, వెనక డిక్కీ లోంచీ పెద్ద పెద్ద పాకెట్స్‌తో సామాన్లు దించి గుమ్మంలో పెట్టారు.
''ఇవేనా..సామాన్లు. పంతులుగారు రాసిచ్చిన వన్నీ వచ్చినట్టేనా?'' అధికారి దర్పంగా అడిగేడు.
''లేదు సర్‌.. ఇవన్నీ వీళ్ళ షాప్‌ నుంచి తెస్తున్నాం. ఇతడు రాజేశ్వరీ డిపార్ట్‌ మెంటల్‌ స్టోర్‌ ఇంచార్జ్‌ ...'' అని పక్కనున్నతన్ని పరిచయం చేసాడు.
అతడు వంగి వంగి దణ్ణం పెట్టేడు.
''కిన్నెరా కిరాణా షాప్‌లో మిగిలిన సామాన్లు పేక్‌ చేయించి ఉంచాను సర్‌. ఇతన్ని దిగబెట్టేసి అవి తీసుకోచ్చేస్తాను సర్‌..'' డ్రైవర్‌ వినయంగా చెప్పాడు.
అధికారి అలాగేనని తలాడించేడు.
అంతసేపూ ఆ షాప్‌ ఇంచార్జ్‌ భయం భయంగా రెండు చేతులూ కలిపి ముందుకు పెట్టుకుని తడుస్తూనే వున్నాడు. అతడే కాదు- ఫుడ్‌ ఐటమ్స్‌ అమ్మే వారందరూ భయపడతారు. ఆ భయం వెనుక రహస్యం, డ్రైవర్‌కి తెలుసు. అప్పుడు నోరు విప్పాడు నెమ్మదిగా, ఆ ఇంచార్జ్‌.
'' ఆ మిగిలిన సామాన్లు కూడా మా వోనర్‌ గారే ఏర్పాటు చేసేద్దారన్నారండి ....'' ఇంకా ముగించకముందే-
''ఆ ఆ వద్దు వద్దు.. అంతా ఒకరి మీదే భారం పడకూడదు...మీ ఒక్కరే ఎందుకు ఇబ్బంది పడాలి. వున్నాయి కదా మిగతా షాపులు ..వాళ్లకు కొన్ని అప్పచెబుదాం.. మీ ఓనర్‌కి థాంక్స్‌ చెప్పండి. మీరు వెళ్లి రండి.'' కూల్‌ గా అన్నాడు అధికారి.
వీళ్ళు ఇలా కదిలేరో లేదో, ఆటోవచ్చింది. సుబ్బారావు, రంగసాయి దిగేరు. ఆటో డ్రైవర్‌ మాత్రం దిగలేదు. అరటిపిలకలు, కొబ్బరి కమ్మలు, మామిడికొమ్మలు, కొబ్బరిబొండాల గెలలు, రకరకాల పువ్వుల సంచులు,
పురితాళ్ళు ఇంకా చాలా చాలా వస్తువుల్ని ఆటోలోంచి సుబ్బారావు, రంగసాయిలు దించేరు. తన గొడుగు అందుకుంటూ ఆటో అతనికి రంగసాయే డబ్బులు ఇచ్చేడు. ఆటో కదిలిపోయేక-
''ఆటోకి డబ్బులు ఇవ్వాలి గదా?'' అన్నాడు అధికారి, జేబులోకి చెయ్యిపెడుతూ .
''ఇచ్చీసేను సర్‌'' అన్నాడు రంగసాయి, ఫరవాలేదు అన్నట్టు.
''మీ చేతి కర్చులు తర్వాత చెప్పాలి.''అన్నాడు అధికారి, ప్రేమగా.
''అలాగే సార్‌'' అంటూ రోడ్డు వైపు చూసాడు రంగసాయి. వర్షం కొంచెం తెరిపిచ్చినట్టు కనిపించింది. సుబ్బారావుకి ఏదో అర్థమయ్యింది.వెంటనే-
''సార్‌ ! అన్ని వస్తువులూ ఇంచుమించు తేచ్చీసినట్లే.. ఏమైనా వుంటే ఫోన్‌ చేయండి...'' చెప్తుండగానే అధికారి భార్య ఇంట్లోంచి వచ్చేసింది.
''...కాదూ, కొమ్మలూ, కమ్మలూ కట్టేసి ఎల్లి పోతే బాగున్ను..'' అంది దీర్ఘంతీస్తూ.
'అవును కదా' అన్నట్టు చూసేడు, అధికారి.
రంగసాయి గుండెల్లో రాయిపడింది. నీళ్ళు నమిలేడు.
సుబ్బారావే అందుకున్నాడు.
''రంగసాయి కొడుక్కి వొంట్లో కొంచెం బాగులేదమ్మ. మందులు కొనుక్కొని వెళ్ళాలి. వర్షం గానీ ఇలాగే తెరిపిస్తే రాత్రి తొమ్మిదీ పదప్పుడు వచ్చి ఇవన్నీకట్టేస్తాము...'' అన్నాడు.
''మాకు నిద్ర దండుగ. తెల్లారి లేవొద్దూ..'' అనుకొంటూ, లోపటికి వెళ్ళిపోయింది.
తన భార్య వైపు చూస్తూ వుండిపోయాడు, అధికారి. అతని కళ్లల్లో భయం లాంటిది గ్రహించేడు సుబ్బారావు. ఆ భయాన్ని తనకు అతికించుకొన్నాడు.
''సార్‌ వర్షం వచ్చినా, వరదొచ్చినా ఉదయం పంతులుగారొచ్చిన టయింకి మేం అంతా రెడీ చేసి
ఉంచుతాం. మాది బాజ్జెత. మీ ఇంట్లో శుభకార్యమంటే మాది కాదా సార్‌..?'' భక్తి తోఅన్నాడు, సుబ్బారావు. అధికారికొంచెం మెత్తబడి 'సరే' నన్నాడు.
వెంటనే గొడుగు తీశాడు, రంగసాయి. సుబ్బారావు సైకిల్‌ స్టాండ్‌ తీసాడు.
''సార్‌ రేపు పదిగంటలకి ఆనందసాయి షాప్‌ నుండి కొన్ని రకాల స్వీట్లు, కోణార్క్‌ షాప్‌ నుండి మరికొన్ని స్వీట్లు, నెంబరు వన్‌ అప్పడాల పేకట్లు వచ్చేస్తాయి. మీరేం వర్రీ కాకండి సార్‌..'' అన్నాడు రంగసాయి మెట్లుదిగి గొడుగు విప్పుతూ.
ఇద్దరూ సైకిల్‌ ఎక్కేసారు. వెనక్కి కూర్చొన్న రంగసాయి ఇద్దరికీ సరిపోయినట్టు గొడుగు పట్టుకొన్నాడు. కొంతదూరం వెళ్ళేక ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు నోరువిప్పాడు రంగసాయి.
''సార్‌ డబ్బులిచ్చేస్తామన్నారు గానీ - కొబ్బరిగెలలకి, కొబ్బరికమ్మలు, మామిడికొమ్మలు తీసినోడికీ ఆటో చార్జీలకీ ఇలాంటి చిల్లర కర్చులకి డబ్బులేటి అడుగుతాము...ఈ వర్షానికి ఎవుడు దొరికాడా?ఏటి ?. గొప్ప కష్టమై పోయిందనుకో ఆళ్ళని ఎతుక్కోడానికి..వర్షంతోటి కొబ్బరిచెట్లు ఎవుడెక్కుతాడు!? అంతా డబల్‌ కర్చే...'' మాటల్లో తన ఇబ్బందిని ప్రకటించేడు, రంగసాయి.
వెంటనే అందుకున్నాడు సుబ్బారావు.
''అచ్చీ! మనమడగ్గలమా !? సబార్డునేట్స్‌..చేతిలో డబ్బులెట్టి పనిచెప్పాలన్న, యింగితం అతగాని కుండాలి. అతనికేటి కర్చు చెప్మీ. ఈ మొత్తం సరుకులు షాపులోలు భయపడి ఇస్తున్నవే ...అందరినీ వాడీసుకున్నాడు. ఆవిడయితే మరీన్ను...''
ఇంతలో మెడికల్‌ షాప్‌ వచ్చింది. మందులు తీసుకున్న రంగాసాయిని ఇంటివద్ద దించీసి సుబ్బారావు తన ఇంటికి వెళ్ళిపోయాడు.
్జ్జ్జ
ఉదయం ఏడు గంటలయ్యింది. ఎప్పుదోచ్చారో గానీ అలంకరణలు తోరణాలు కట్టడాలు పూర్తి చేసీసేరు. అయినప్పటికీ ఎదోపనిలో నిమగం అయినట్టే కనిపిస్తున్నారు. ముఖ్యంగా అధికారి భార్య చూస్తున్నప్పుడల్లా. ఆమె స్నేహితురాళ్ళు ఇద్దరు వంటగదిలో సహకరించడానికి వచ్చున్నారు. పెరట్లోపనులు చేయడానికి అతని చుట్టాలు ఇద్దరు వచ్చున్నారు. వ్రతం చేస్తున్న వారు పట్టుబట్టల్లో మెరిసిపోతున్నారు. పదిసార్లు అరిస్తే- కొడుక్కూడా పట్టుబట్టలు ధరించేడు.
''అంతా వోకే... ఇంకా పంతులుగారే రావాల్సి వుంది.'' అన్నాడు భార్యతో అధికారి.
''అంతా సిద్ధమే, మీదే ఆలస్యమని మీరు ఫోన్‌ చేయొచ్చు కదా?'' సలహాలాంటి ఆజ్ఞ జారీచేసింది.
''పంతులు గారి ఆలస్యాన్ని ఎత్తి చూపకూడదు మనం...'' అంటూ ఫోన్‌ అందుకున్నాడు.
ఇంతలోనే ఫోన్‌ మోగింది. పంతులుగారి నుండే అది. ఖంగుమంది గొంతు.
''మినిష్టరు గారు ఏదో ముహుర్హం కోసం అతని పీ. ఏ ను పంపేరు. ఓ గంట పడుతుంది. అందాక నా శిష్యున్ని పంపుతున్నాను.. నేను వచ్చేలోగా పూజకు పీఠం సిద్ధం చేస్తాడు...వర్షం వస్తోంది పోతోంది.. సరిగ్గా ఎనిమిది గంటలకు మీకారు పంపించండి ..'' అని సమాధానం కోసం చూడలేదు. ఫోన్‌ కట్‌ అయ్యింది..
'ఆ పనిమీద వుండు' డ్రైవర్‌కి పురమాయించాడు అధికారి.
వంటగదిలోంచి భారీ శరీరంతో వొకామే టీ గ్లాసులు పళ్ళెంలో పెట్టుకొని వచ్చింది.
''వదినా ప్రసాదాలు అన్నీ సిద్ధం. పంతులుగారు రావడానికి టైం పట్టేట్టుంది. టీలు తాగొచ్చు మరేం ఫర్వాలేదు..'' అని చేరోగ్లాసు అందించింది. తానో గ్లాసు అందుకొని, పళ్ళెం గోడమీదపెట్టి డ్రైవర్‌ వైపు చూసింది.
డ్రైవర్‌ గబగబా వచ్చేడు. తానో గ్లాసు తీసుకొని మిగిలిన రెండు సుబ్బారావు, రంగసాయిలకు అందించాడు. చలితో ఉన్నవాళ్ళకి ఆ వేడి టీ ఎంతో ఊరటనిచ్చింది. డిస్పోజల్‌ గ్లాసుల్ని అందరిదగ్గర నుండి వొద్దికగా అందుకొని డస్ట్‌బిన్‌లో వేస్తున్నాడు సుబ్బారావు.
ఇంతలో రంగసాయి ఫోన్‌ మోగింది.
''సార్‌ కేటరింగ్‌ వాళ్ళు పదకొండు గంటలకు వచ్చేస్తామని చెప్పమన్నారు..'' తనకొచ్చిన ఫోన్‌ సారాంశాన్ని అధికారికి చెప్పేడు రంగసాయి.
''అవి ఎలాగూ వస్తాయిగానీ ముందు డ్రైవర్‌ని పంపించండి పంతులుగారి దగ్గరికి. ఈ వర్షం వొకటీ ఆగాగి వస్తోంది.'' అధికారి భార్య కల్పించుకొని, తక్షణం ఏమి చేయాలో ఆదేశించింది.
డ్రైవర్‌ బయలుదేరాడు.
్జ్జ్జ
కారు దిగుతున్న పంతులుగారి దగ్గరకు, గుమ్మం దిగి పరుగెత్తుకొచ్చారు యజమాని, అతని భార్య, అతని కొడుకు. అక్కడున్న మూడు చెంబులతో భక్తిగా పంతులు గారి కాళ్ళు కడిగి కళ్ళకద్దుకున్నారు. అకస్మాత్తుగా వర్షం కూడా ఆగిపోయింది. పంతులుగారు ఆకాశం వైపు చూసి, అధికారి వైపు చూసాడు. అర్థం చేసుకున్న అధికారి 'అంతా మీ చలవ..' అంటూ రెండు చేతుల్తో మళ్లీ నమస్కరించేడు. పూజ గదిలోకి అడుగుపెట్టాడు పంతులు. పీఠం దగ్గరున్న శిష్యుడు రెండడుగులు పక్కకు తప్పుకొన్నాడు, వినయంగా. అంతా గమనించిన పంతులుగారు తప్తిగా తలాడించేరు. వొక మంత్ర శ్లోకం చదివి పీఠంమీద ఆసీను డయ్యాడు. ఎవరి పక్కన ఎవరు కూర్చోవాలో నిర్ణయించి ముగ్గుర్నీ ఆదేశించారు. వొక్క క్షణం కళ్ళుమూసుకొన్నాడు. అంతలో, వొక్కసారిగాకళ్ళు తెరిచి ప్రవేశ ద్వారంవైపు చిరాగ్గా చూసేడు. అది గమనించిన అధికారి అంతే చిరాగ్గా వంటగదివద్ద నించొని వున్న తన చుట్టాల్లో వొకామెవైపు చూసాడు. ఆమెకు అర్థమయ్యింది. పరుగెత్తుకెల్లి, డ్రైవర్‌ని, మరో ఇద్దర్నీ మాటలాడవద్దని హెచ్చరించి వచ్చింది.
పంతులుగారు పూజలో లీనమైపోయారు. మంత్రాలు ప్రవాహంలా సాగిపోతున్నారు. యజమాని కుటుంబం, పంతులుగారు చెప్పినట్టు చేస్తున్నారు. సుమారు రెండు గంటలపాటు ఎటువంటి ఆటంకం కలగలేదు. వ్రతం పూర్తి అయిపోవచ్చింది. మరో మంత్ర శ్లోకంతో వ్రతం ముగించేడు పంతులు. హారతి వెలిగించి, కుటుంబసభ్యులకు మాత్రమే ఇచ్చి కింద పెట్టేసాడు. గంభీరంగా మొఖం పెట్టి తన రెండుకాళ్ళు కొంచెం ముందుకు జరిపాడు. కుటుంబసభ్యులు వొకరి తర్వాత వొకరు, అతని పాదాలను తాకి దండం పెట్టుకున్నారు. వాళ్ళతలల మీద మంత్ర పుష్పాక్షతలు చల్లి-
''అంతా సవ్యంగా జరిగిపోయింది. మీ అదష్టం బాగుంది. వర్షం కూడా పూర్తిగా ఆగిపోయింది. ఇంకా మీకు అడ్డు లేదు. మీరు భోజననాలకి పిల్చుకున్న బంధువులు దర్జాగా రాగలరు... ఇంతకీ ఎంతమందిని పిల్చుకున్నారు?'' అడిగేరు పంతులుగారు.
''ఏదోనండి... నియర్‌ అండ్‌ డియర్‌ ఓ వందమందికి...''
''ఈ వ్రతమే చెప్తోంది. ఇక అంతా శుభమే... మీ అబ్బాయికి త్వరలో వుద్యోగం వచ్చేస్తాది. ఈసారి ఇంకా బ్రహ్మాండంగా పూజ చేద్దాం.''
పంతులుగారి ఈ మాటలకి భార్యా భర్తలిద్దరూ తెలియని అనుభూతికి లోనయ్యేరు.
''మీ వాక్కు బ్రహ్మ వాక్కుకావాలి...''
''...నా వాక్కుకి తిరుగులేదు...''
'' గురువుగారూ! పీఠంపై వున్నంతసేపూ మీ ముఖంలో ఒక రకమైన వెలుగు...'' అన్నాడు అధికారి,సంభ్రమంగా.
''మీరు గమనించారు కాబట్టి ఓ రహస్యం చెప్తాను... పీఠం మీద కూర్చొని పూజ చేసింది, నేను కాదు.. సాక్షాత్తూ ఆ బ్రహ్మదేవుడు...'' అని ఆకాశం వైపుగా రెండుచేతులూ జోడించాడు.
''...పీఠం దిగిపోతే నేను మామూలు పురోహితుణ్ణి మాత్రమే'' అని శిష్యుడి వైపు చూసాడు.
అవున్నిజమే అన్నట్టు శిష్యుడు తన రెండుచేతులూ గురువుగారి పాదాలవైపు చాచి కళ్ళకద్దుకున్నాడు.
పంతులుగారు ఏదో గుర్తుకొచ్చిన వాడిలా ముఖం పెట్టి -
'' నాకు టయిమవ్వుతోంది. ఇక తాంబూలాలు..దానాది కార్యక్రమాలు?.'' అంటూ చేతి వాచీ చూసుకున్నాడు.
అధికారి డ్రైవర్‌ వైపు చూసేడు.అతడు కారు టర్న్‌ చేయడానికి వెళ్ళాడు. రంగసాయి, సుబ్బారావుల వైపు చూసేడు. పంతులుకివ్వ్వాల్సిన సర్వ సంబారాలు ఉదయమే పేక్‌ చేయించబడ్డాయి. అవన్నీకారు డిక్కీలో పెట్టడానికి కదిలేరు. శిష్యుడు పూజా స్థలంలో నున్న ధనరూపాలు, ఇంకా చాలావరకు దినుసుల్నీ, కొన్ని సంచుల్లో సర్దేసాడు. చిన్నచిన్న వెండి బంగారాలతో చేయించిన నమూనా విగ్రహాల మీద, దానం రూపంలో కేటాయించిన అనేక ఇతర వస్తువుల మీద - స్వీకరించినట్టుగా పంతులుగారు చేతులూ ఆనించి తీయగానే-వాటినీ సర్దేసాడు శిష్యుడు. ఇవన్నీ సుబ్బారావు రంగసాయిల సహాయంతో డిక్కీలో పెట్టించాడు క్షణాల్లో.
అరతులం బంగారం ఉంగరం వున్న చిన్న డబ్బీని కొడుకుచేత ఇప్పించేడు, అధికారి.
''శ్రీఘ్రమేవ వుద్యోగం ప్రాప్తిరస్తు...'' అని దీవించి వుంగరం అందుకున్నాడు.
పట్టుబట్టలూ, పదివేల రూపాయలు దక్షిణా కలిగిన వెండిపళ్ళాన్ని భార్యాసమేతంగా అందించేడు అధికారి. ఆయురారోగ్యాలూ సకల అష్టైశ్వర్యాలూ ప్రాప్తించమని ప్రసన్నవదనంతో దీవించారు, పంతులుగారు.
''...ఎంతో బరువు దిగిపోయిన్దండీ...'' అన్నాడు అధికారి.
''పూజ బాగా జరిగింది. మరి నాకు శలవ్‌.. వెళ్లొస్తాను...'' అని కారువద్దకు కదిలేరు పంతులుగారు.
తనభార్యతో అనుసరించేడు అధికారి. స్వయంగా కారు డోరు తీశాడు. కొడుకు గుమ్మం మీదే ఉండిపోయాడు. అధికారితో పాటు కిందకి దిగేరు సుబ్బారావు, రంగసాయి లు .
డ్రైవర్‌ కారు కదిలించేడు. మరోసారి నమస్కారాలు అయ్యేయి.
''...అంతా అనుకున్నట్టే అయింది కదండీ..!? అంటోంది భార్య, సంతోషంతో.
అవునన్నట్టుగా నిట్టూర్పు విడిచాడు, అధికారి.
''...పంతులు బాగా చేసేడు...'' అని అధికారి తరపున వచ్చిన ఇద్దరూ పెరట్లో అనుకొంటున్నారు.
''..పిండికొద్దీ రొట్టె..'' అధికారి భార్య తరుపువారు వంటగదిలో అనుకున్నారు.
''..భోజనాలకి ఏమయినా సాయం చేయాలా సార్‌?'' అని అడిగేరు, సుబ్బారావు, రంగాసాయిలు, వినయంగా.
''.. ఎందుకు? మా చుట్టాలున్నారుకదా. ఆ పైన కేటరింగ్‌ వాళ్ళుంటారు. ఫరవాలేదు. ఇప్పటికే లేటయ్యింది. మీరు వెళ్ళండి..'' అన్నాడు అధికారి.
సుబ్బారావు, రంగాసాయిలు నమస్కారాలు చెప్పి,
సైకిళ్ళు ఎక్కేసారు.
వాన పూర్తిగా వెలిసిపోయింది.
్జ్జ్జ
''బాగుందిరా కథ. దశ్యం కళ్ళకు కట్టించేవు. కథ గురించి మంచిచెడ్డలు నేను చెప్పలేను. గౌర్నాయుడు అంకుల్‌కి పంపించి అభిప్రాయం అడుగు. అసలు నీకెందుకు ఈ కథ రాయాలనిపించింది...'' అడిగేడు తండ్రి.
''అంకుల్‌ వోసారి మనింటికి వచ్చినప్పుడు 'అలివోడ్ని బలిమోడు తింటే - బలిమోడ్ని బ్రమ్మదేవుడు తింటాడట' అని ఎందుకోగానీ ఒక సామెత పొడిచేరు. అది కథ చేసేను. అంకుల్‌కి నిన్ననే మెయిల్‌ పెట్టేను...చదివి అభిప్రాయం చెప్తామన్నారు..'' అని చెప్తుండగానే గౌర్నాయుడు నుంచి ఫోన్‌ వచ్చింది.
స్పీకర్‌ ఆన్‌ చేశాడు రోహిత్‌.
''రోహిత్‌! నా సామెతకు కథారూపం ఇచ్చి కొత్తగా అర్ధం చెప్పినట్టున్నావ్‌.. బాగుంది. మరిన్ని కథలు రాయాలని ఆశిస్తున్నాను...''