సామాన్యుల హృదయ ఘోషకు గొంతునిచ్చిన కవిత్వం

డాక్టర్‌ కె.జి.వేణు
98480 70084

ఆధునిక తెలుగు సాహిత్యంలో కవిత్వానికి ఘనమైన చరిత్ర ఉంది. కవిత్వమంటే ఒక అనుభూతి, ఒక రసానుభూతి. కవిత్వమంటే మేథస్సు చేసే అద్భుతమైన ఒక సాహసం. మనిషి అభివ్యక్తీకరణకు కవిత్వాన్ని మించిన సాధనం మరొకటి లేదు. మామూలుగా మనిషి ఊపిరికి వాసన ఉండదు. కాని కవి రాసిన కవిత్వానికి ఒక పరిమళం ఉంటుంది. ఆ పరిమళం ప్రజల పక్షాన రాసే కవిత్వంలో మరింతగా గుబాళిస్తుంది. కవిత్వం రాయటానికి కాగితాలే కాదు, నిబద్ధత ఎంతో అవసరం. ఆలోచనలో నవ్యత, పదాల సంధింపులో నైపుణ్యత, వాస్తవాల చిత్రీకరణలో చిత్తశుద్ధి, రాజకీయ, సాంఘిక, ఆర్థిక సమస్యల పట్ల లోతైన అవగాహన, ఇత్యాది విషయాలు కవిత్వ నిర్మాణంలో ప్రధాన భూమికను పోషిస్తాయి. ఈ అంశాలను బోధించే పాఠశాలలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థి 'అవతలివైపుకే..' కవితా సంపుటి సృజనకర్త ఉప్పల అప్పలరాజు.
ఈ కవి అసలు ఎందుకు కవి అవతలి వైపుకు చూస్తున్నాడు? ఎందుకు మనల్ని కూడా అటువైపే చూడమంటు న్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఆవతలి వైపున కొన్ని నిజాలు వున్నాయి, సత్యాలు వున్నాయి, వాస్తవాలు వున్నాయి. అన్యాయాన్ని, దోపిడీ దౌర్జన్యాలను ఎదిరించే ఎత్తిన పిడికిళ్ల శబ్దాలు అక్కడ ఉన్నాయి. శ్రమజీవి చెమట చుక్కల్ని సుగంధ ద్రవ్యాలుగా భావించే, ప్రగతిశీల మైదానాలున్నాయి. మనిషి కష్టాన్ని, మనిషి ప్రతిభను గుర్తించి, నైపుణ్యానికి నిత్యం హారతులిచ్చే సంస్కారపూరిత నేస్తాలు అక్కడ ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే శ్రీశ్రీ ఆశించిన మరో ప్రపంచం వుంది అక్కడ.
మరి ఇవతలివైపున ఏముంది? ఈ సంపుటిలోని 'రుతురాగం' కవితలో కవి చెప్పినట్లు... మనుషుల ప్రాణాలను హరిస్తూ, ఫ్యాక్టరీల పుష్పాలు వెదజల్లే రసాయనధూళి కణాలున్నాయి ఇక్కడ. హత్యలు, ఆత్మహత్యలు, ఆత్మహత్యల్లాంటి హత్యలు ఉన్నాయి ఇక్కడ. అన్నం దొరక్క ఆకలి, తిన్నది అరక్క రోగాలు చిగురించే దృశ్యాలున్నాయి ఇక్కడ. కనికరం లేకుండా రోగుల శవాలను నోట్ల కట్టలుగా మార్చుకునే క్రూర పైశాచిక కార్పొరేట్‌ ఆసుపత్రులున్నాయి ఇక్కడ. డాలర్లకోసం అదృశ్యమై పోతున్న మేథాసంపత్తి నీడలున్నాయి ఇక్కడ. మనుషుల్ని, మనుషులుగా కాకుండా వర్తక సామాన్లుగా మారుస్తున్న ప్రపంచీ కరణ భూతం వుందిక్కడ. దాదాపు ఏడున్నర దశాబ్దాలుగా ఆవతలి వైపుకు చేరటానికి శ్రమజీవులు పడిన శ్రమను నిత్యం దోపిడీ చేస్తున్న దృశ్యాలున్నాయి ఇక్కడ. అడుగులు అవతలి వైపుకు కదలకుండా సామాన్యుల కాళ్లకు వేసిన బేడీలు కర్కశంగా గేలి చేస్తున్న వికారపు స్వరాలున్నాయి ఇక్కడ. అందుకే అడ్డంకిగా ఎదుగుతున్న ఆ ఇనుప తెరల్ని తొలిగించి సామాన్య జనాల్ని ఆవతలి వైపుకు నడిపించటానికి అప్పలరాజు వెలిగించిన 42 కాగడాల సమూహపు వెలిగే ఈ కవితా సంపుటి.
పొలాలు నీటిలో తడవటం, పంటలు పండటం సాధారణం. అవే పొలాలు పాటని, నీటిని కౌగలించుకుని పరవశించటం ఈ సంపుటిలోని 'పాట' కవితలో మనం చూడవచ్చు. పెట్టుబడిదారీ వ్యవస్థ రైతును పీల్చి పిప్పి చేయగా, పిప్పిగా మిగిలిన ఆ పిండి మరో పంటకు ఎరువుగా మారే దయనీయ స్థితిగతుల్ని 'పాట' కవితలో దృశ్యీకరించబడ్డాయి. ఇందులో పాడుకునే పాటను ప్రశ్నించే రూపంగా కవి మార్చిన తీరు పాఠకుల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తుంది.
ఒకప్పుడు చీకటంటే అందరూ భయపడేవారు. ఇప్పుడు
చీకటంటే భయం లేదు. పైగా చీకటిని చాలామంది కోరు కుంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో సన్నివేశాల సాక్ష్యాలతో 'సంబరం సముచితం కాదు' అన్న కవితలో సవివరంగా వివరించే ప్రయత్నం చేశాడు కవి. కట్టడాల నిర్మాణంలో కరెన్సీ కట్టలు చేతులు మారటానికి చీకటి కావాలి. వెలుగులో అర్ధనగ అందాల పోటీలను అసహ్యించుకున్న పెద్ద మనిషి న్యూడ్‌ షోలను తిలకించటానికి చీకటి కావాలి. ఇలా చీకట్లో సుఖంగా బతికే వారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. చివరికి అది పగలో రాత్రో, చీకటో వెలుతురో ఏమీ తెలియని అస్పష్ట స్థితిలోకి ప్రపంచం జారుకుంటోంది. అందుకే ఈ కవిత ముగింపులో 'అప్పుడెప్పుడో ఒక్క నరకాసురుడు చచ్చాడని / ఇప్పటికీ ఇంత సంబరం సముచితం కాదు / ఇప్పుడీ దీపావళి అవసరమే లేదు...' అంటున్నాడు కవి. ఈ అభివ్యక్తీకరణతో ఆలోచింపజేసే కవితల వరుసల్లో ఈ కవిత సగౌరవంగా తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగింది.
అకృత్యాలకు, అన్యాయాలకు నిరంతరం బలైపోతున్న ఆడపిల్లలకు మనోధైర్యాన్ని, తెగింపు పోరాటాన్ని నేర్పిన కవిత.. 'కాస్త ఆలోచిస్తే'. 'వాడు ఏకంగా పోస్తున్నాడు ఆసిడ్‌ నీ ముఖం మీద/ కోపగించుకున్న వాడి మొహంమీద పేడనీళ్లయినా చల్లలేవా?' అంటూ కవి ప్రశ్నిస్తున్నాడు. 'వాడు గొడ్డలితో నరుకుతూ వుంటే... చూస్తావేం / ఎత్తు కత్తిపీట, కూరగాయలు, ఆకుకూరలు కోసిన నీ చేతులకు/ కుత్తుకలు కోయటం కష్టమైన పని కాదు..' అంటూ స్త్రీ సాహసాన్ని మరోసారి గుర్తుకు చేస్తోంది ఈ కవిత. ఉద్యోగ విరమణ అనగానే చాలామంది లెక్కపెట్ట లేనంత విషాదాన్ని భుజాల మీద మోస్తూ ఉంటారు. రిటైర్మెంట్‌ సమయంలో ఆ చర్య ఎంత అసందర్భమో వివరించిన దీర్ఘకవిత 'ఆరంభం'. రిటైర్మెంట్తో నా పని సరి... అని నిరాశపడే వారికి ధీటుగా... 'కానీ నదిగా నా జీవితం / ఇప్పుడే, ఇక్కడే ఆరంభ మవుతుందనుకోలేదు..' అంటాడు కవి. రిటైర్మెంట్‌ జీవితాన్ని నదితో పోల్చటం ఒక అద్భుతమైన ఆలోచన. 'రిటైర్మెంటంటే... జీవితానికి అంతిమ దశ కాదు/ నవ జీవన యాత్రకి ఆరంభం, అక్కడ్నుంచే...' అంటూ ఒక వినూత్నమైన కొత్త జీవితానికి దారులు చూపిస్తున్నాడు కవి. ఈ కవిత, విలియం వర్డ్స్‌ వర్త్‌ రాసిన 'రిటైర్మెంట్‌', విలియం డిక్సన్‌ రాసిన 'సమ్‌ డేస్‌ రిటైర్డ్‌ ఫ్రం ది రెస్ట్‌' కవితలను గుర్తుచేయటం ఆనందాన్ని కలిగించింది.
ఒక చలనచిత్రాన్ని మన కళ్లముందు కదిలేలా చేసిన కవిత 'ఆ నవ్వు వాడిదే'. ఈ చలనచిత్రంలో కథానాయకుడు ఎవడో కాదు. చెత్తకుప్పల్లో నిత్యం కాగితాలు ఏరుకునే పట్టుమని పదేళ్లు కూడా లేని ఓ అనాథ కుర్రాడు. ఇందులో కవిత ఎత్తుగడే అద్భుతంగా ఉంటుంది. 'పట్టుమని పదేళ్లు లేనివాడు / సూర్యుడి కంటే ముందే లేచాడు వాడు.../ కళ్లు నులుమకుని అరచేతులు చూసుకుని/ అప్రయత్నంగా నవ్వుకున్నాడు...' అంటూ ప్రారంభంలో వాడి పరిచయం అలా కొనసాగుతుంది. కవితలో అడుగడుగున 'మరి నేనెవర్ని?' అంటూ మనల్ని కలవరపెట్టే
ప్రశ్న ఒకటి ఎదురవుతూ వుంటుంది. ఈ సందర్భంలో కవి ఇలా అంటున్నాడు. 'గోనెసంచితో పాటు / భారమైన ఆ ప్రశ్ననీ మోయటం / ఆలవాటు చేసుకున్నాడు వాడు / బహుశా వాడికీ ప్రశ్న / బతుకుకన్నా భారమైనదేమో...' నిత్యం వాడిని గమనిస్తున్న కవి భావన అది. చివరికి వాడి జన్మరహస్యం తెలిసి అదోలా నవ్వుకుంటాడు వాడు. ఆ నవ్వు గురించి కవి ఇలా అంటున్నాడు : 'ఆ నవ్వు బుద్ధుడిదో - జీసస్‌దో .. అసలు ఎవరిదీ కాదేమో... ఆ నవ్వు వాడిదే...' అంటూ, ఒక తిరుగులేని తీర్మానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టాడు కవి. ఈ కవితను చదువుతున్నప్పుడు శాంతిప్రభ రాసిన 'అనాథ పిల్లల ఆర్త నాదాలు' కథల సంపుటిలోని చాలా దృశ్యాలు దర్శనమిస్తాయి. అలాగే లీక్వింగ్‌ జావ్‌ రాసిన చైనా కవిత 'ఐయామ్‌ యాన్‌ ఆర్ఫాన్‌' మనముందుకు వచ్చి మనతో కరచాలనం చేస్తుంది.
అతిసామాన్యంగా కనిపించే దృశ్యాన్ని, అసమాన్యంగా కవిత్వం చట్రంలో బిగించి తళుక్కుమనే తారగా తీర్చిదిద్దటంలో అప్పలరాజుది ఒక ప్రత్యేకమైన శైలి. 'ఫలితం' కవితలో ప్రయోగించిన పదాలు ఎలా సాక్ష్యం పలుకుతున్నాయో ఒక్కసారి చూద్దాం. 'విసురుగా వీచిన గాలికి తెగిపోయిన తీగను/ తన మెడకు చుట్టేసుకుని / తనకుతానే ఆత్మహత్య చేసుకుంది కరెంటు స్తంభం.' వీధిలైటు వెలగటం లేదు... అన్న మామూలు విషయాన్ని కవిత్వపరంగా చెప్పటానికి కవి కలానికి చాలా సత్తువ ఉండాలి. ఆ సత్తువే సంపుటినిండా మనల్ని పలకరి స్తోంది. అప్పలరాజు అధ్యయనం నిరంతరం సామాన్య ప్రజల సమస్యల మీదే. అందులో భాగంగా రోడ్ల విస్తరణలో విస్తారంగా నష్టపోతున్న గ్రామాల గురించి, రైతు, కూలీగా మార్పు చెందే దురదృష్టం గురించి, హైటెక్‌ సిటీ పొరలను విప్పితే అస్థి పంజరాలుగా మారిన మనుషుల చరిత్ర గురించి, అన్నం కోసం ఆశగా చూస్తున్న కళ్లల్లో విస్ఫోటనం రేగిన మన్ను గురించి, నాలుగు రోడ్ల కూడలిలో నాలుగు తరాలను చూస్తూ తన పద్యాన్ని తిరగరాసుకుంటున్న గురజాడ గురించి 'విస్తరణ' కవితలో వాస్తవ రూపాలను బలమైన వ్యక్తీకరణతో సమర్థవంతంగా చిత్రీకరించాడు కవి.
కవి చేతిలోని కలం చేసిన విన్యాసాలకు పాఠకులు ముగ్ధులై మురిసిపోయే కవిత 'ప్రగతి ప్రయాణం'. ఈ కవితలో ఓ మనిషిరూపం అనంతమైన తన ప్రయాణాన్ని గురించి చెబుతుంది. ఈ కవిత్వం నిండా చరిత్ర ఉంది.. చరిత్ర నిండా యుద్ధాలు వున్నాయి. యుద్ధాలకు - యుద్ధాలకు మధ్య గడ్డకట్టిన నల్లటి నెత్తుటి శాంతి ఒప్పందాలున్నాయి. కవి ప్రయోగించిన నల్లటి నెత్తురు పదాన్ని తాకగానే, చేతులకు అంటిన తడినిండా గతంలో ఏ ఫలితాన్ని అందించని శాంతి వొప్పందాలు వెక్కిరిస్తూ మనల్ని పలకరిస్తాయి. ఇదే కవితలో దేశంలో కలవరపెట్టే పరిస్థితి గురించి చెబుతూ... 'దారి తప్పిన గొర్రెపిల్లను వెదుకుదామని పోతే / అసలు గొర్రెలన్నీ దారితప్పాయని తెలిసింది..' అంటాడు కవి. ఇందులో అంతర్లీ నంగా ఉన్న భావం, దేశంలో దారి తప్పుతున్న ప్రతి మనిషికి వర్తిస్తుంది. ఈ కవిత ముగింపులోని వాక్యాలు మనల్ని వెంటాడ తాయి. 'ఏ అస్పష్ట చీకటిలోంచి ప్రారంభమయిందో నా ప్రయా ణం / ఇంకా అక్కడే ఉన్నాను...' అంటూ 'అమ్మా! నీ కడుపులో నేను నిద్రించిన నవమాసాలే నాది సుఖనిద్ర/ ఆనక అన్నీ ఆరాటాలు, పోరాటాలే/ నా గమ్యానికింకా భూమధ్య రేఖంత దూరం నడవాలి...' అంటాడు కవితలోని పాత్రధారి. సాహిత్య ప్రమాణాల్లో సంతృప్తికరమైన తూకం తూగిన కవిత ఇది.
నగర వాస్తవ దృశ్యాలను అతి దగ్గరినుంచి గమనించిన వ్యక్తి అప్పలరాజు. నగరాల వికృత రూపాన్ని, ఆ నగరాల ఇనుప పాదాల కింద నలిగి నాశనమై పోతున్న గ్రామాల దుర్భర పరిస్థితుల్ని తన అధ్యయనం కెమరాలో సమర్థవంతంగా బంధించి మనకు సమర్పించిన కవిత 'నగరంలో వసంతం'. 'నీటిలో మొసలంత బలమైంది నేలమీది నగరం/ ఏ గ్రామాన్న యినా ఆహారంగా మింగేస్తుంది ...' అంటూ నగరాలు, గ్రామాలను కబళిస్తున్న వైనాన్ని తనదైన శైలిలో వ్యక్తపరిచారు. ఉపకారం కోసమే పెరట్లో నిలబడివున్న అరటి చెట్టును కవి తన 'త్యాగమూర్తి' కవితలోకి ఆహ్వానించి సింహాసనం మీద కూర్చోపెట్టిన హారతులిచ్చిన దృశ్యం నయనానందకరంగా ఉంది. ఈ కవితలో... 'రాత్రి పాపాల్ని ఉదయాన్నే / పగటి పాపాల్ని రాత్రవగానే/ స్నానాల గదిలో నువ్వు కడిగేసుకుంటుంటే / ఆ మలినాలను లవణాలుగా స్వీకరించి/ నీ పాపాలను బాపే దేవతలా నిలుచుంటుంది పెరటిలో అరటి...' అంటూ తల్లికి అరటి మరో రూపమని చెప్పారు.
ఆత్మహత్యల జాబితాలో ప్రముఖంగా కనిపించే పేర్లు రెండు. ఒకటి రైతన్న, రెండు నేతన్న. పత్తిపంట నేపథ్యంలో నేతన్నని ప్రస్తావిస్తూ 'చిత్రం' కవితలో కవి ఇలా వ్యక్తం చేస్తున్నాడు... 'అదేమి చిత్రమైన పత్తి / ఆ నూలు వడికినవాడు ఆకలితో వొణుక్కుంటూ పోయాడు / దానితో మగ్గంమీద బట్టనేస్తున్నవాడు మగ్గంమీదే మగ్గిపోయాడు / విచిత్రమేమిటంటే ఆ గుడ్డముక్క నానా రంగులు పులుముకుని / అనేక పార్టీ ఆఫీసుల మీద జెండాగా ఎగురుతోంది...' అని పేర్కొన్నారు. నేతన్న దుస్థితికి అద్దం పట్టిన కవిత ఇది. ఒక్కొక్కమారు కవి బలమైన ప్రశ్నల్ని ప్రజలవైపు కూడా సంధిస్తాడు. 'వాడి కాలు కింది చెప్పు కోసం / నీ తలని ఇంకొకడికి అమ్మేస్తూవుంటే / చూస్తూ వూరు కుంటావేం నేస్తం...' అని 'ఆవేదన' కవితలో ప్రశ్నించారు. ఈ ప్రశ్నతో అనుసంధానమైతే- ప్రతి పౌరుడూ మార్పుకోసం పిడికిళ్లతో ముందుకు అడుగులు వేస్తాడు. ఇదే కవితలో 'రుద్రాక్షను దారానికి గుచ్చి మెడలో వేసుకున్నట్లు/ భూగోళాన్ని వ్యాపారానికి గుచ్చి/ గ్లోబలైజేషన్‌ అంటున్నాడు ప్రపంచ బిజినెస్మెన్‌...' అని యథార్థమైన విషయాన్ని శక్తివంతంగా వ్యక్తం చేశారు. పాలకులు మారినా మారని అన్నదాతల స్థితి గురించి చెబుతూ 'పద్యానికి పండగ సందర్భమేనా' కవితలో .. 'చెరుకు పిండితే నెత్తురు కారుతోంది/ పొగాకు పండిన చోట బతుకు నుసై మిగుల్తోంది / పట్టెడన్నం కోసం పత్తిని పండిస్తే / రైతుల తల దగ్గర వత్తి మాత్రమే మిగిలింది...' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కవితలో పెరిగిన ధరల గురించి వ్యంగ్య బాణాలను సంధిస్తూ... 'ఇక్కడ బజారుకెళ్లి సరుకులు మోసుకురావటం కష్టం కానేకాదు / సరుకుల కోసం డబ్బును మోసుకెళ్లడమే సిసలైన కష్టం...' అన్నారు.
ఇందులోని 'ఊహాచిత్రాలు' కవిత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఈ కవితలో ఊహలు లేవు, అన్నీ నిజాలే. ఎంత నిజాలంటే అమ్మపాల కమ్మదనమంత నిజాలు. విదేశాల ఉద్యోగాల కోసం తెగతెంపులు చేసుకున్న బంధాల పోగుల్ని ఇందులో మనం చూడవచ్చు. కన్నతల్లి జోలపాట స్వరాలకు మంగళం పాడుతున్న అత్యాధునిక ఆటవికతనాన్ని, ప్రపంచీ కరణ అనే హైటెక్‌ ఆక్సిడెంట్లో తెగి రాలిపోతున్న జీవిత అవయవాల భీకర దృశ్యాల్ని, గ్లోబల్‌ విలేజ్‌ జాతరలో వెంటపడి వేధిస్తున్న వేటకొడవళ్ల ఆకలిని... ఈ కవితలో మనం గమనించవచ్చు. వెరసి వస్తువు, శిల్పం పోటీపడి పాఠకుడ్ని పలకరించిన ఉత్తమ శ్రేణి కవితా విన్యాసాలను తనితీరా ఈ కవితలో మనం దర్శించవచ్చు. ఈ కవితా సంపుటిలో స్పష్టమైన వస్తువైవిధ్యాన్ని మనం చూడవచ్చు. పదాల ప్రయోగాలలో ఓ అందమైన గుబాళింపు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. పదచిత్రాల రూపకల్పనలో ఓ చక్కటి శబ్దశక్తి వినసొంపుగా మనకు వినిపిస్తుంది. భావచిత్రాల ఎంపికలో దార్శనికత మనల్ని అబ్బురపరుస్తుంది. ఈ సంపుటిలోని కవితలన్నీ మనమందరం చర్చించుకునే స్థాయిని సగౌరవంగా కలిగివున్నవే.
ఈ సంపుటిని చదివిన తరువాత, అప్పలరాజు కవిత్వాన్ని రాశాడు అనేదానికంటే లోకంలో వున్న సామాన్యులందరి బాధలు, కష్టాలు, నష్టాలు, వాళ్లు నిత్యం ఎదుర్కొంటున్న మోసం, దగా, కుట్ర, కుతంత్రాలు, సగటు మనిషి బలహీనతలు, తప్పిదాలు ... వీటన్నింటినీ కాచి, వడబోసి అందులోనుంచి సప్తవర్ణాలను బయటికి తీసి తన కలం అనే కుంచె చేత ఒక చక్కటి సాహిత్య వర్ణపటాన్ని అందించాడని గర్వంగా చెప్పవచ్చు. ఈ కవితలు చదువుతూవుంటే అతని కవిత్వంతోపాటు మానవ ప్రపంచంపై మనకు మరింత నమ్మకం కలుగుతోంది. విశాఖ సముద్ర తీరాన కవిత్వంలో తన్ను తాను నిబద్ధతతో అందంగా చిత్రీకరించుకున్న కవితా చిత్రకారుడు ఉప్పల అప్పలరాజు. తెలుగు సాహిత్యంలో తన సంతకాన్ని మరింతగా సుస్థిరం చేసుకోవటానికి నిత్యం శ్రమిస్తున్న ఈ కవిని అభినందనలు.