శూన్య కవిత

సాంబమూర్తి లండ
96427 32008

ఎట్టకేలకొక
పూలరుతువు నన్ను పలకరిస్తుంది
వసంతాలు నన్నుల్లుకుని తెగ అల్లరి చేస్తాయి
వయసు కొమ్మమీద కోయిలలు వాలి
పాటందుకుంటాయి
అప్పుడే
నా చుట్టూ మొదటి ముళ్ల కంచె మొలుస్తుంది

కొన్ని అనూహ్య మలుపుల తర్వాత
నేనో నదినవుతాను
ఎన్నో పాయలుగా ఉరకలెత్తి
ఎన్నో తీరాలుగా విస్తరించి
దారి పొడుగునా ఉత్సవమై సాగిన కాలం నిమ్మళిస్తుంది
నాలో ఇంకిపోయిన కలలు కొన్ని
తిరిగి రెక్కలు తొడుక్కొని
భుజం మీద సందడి చేస్తాయి
అప్పుడే
నా పరివాహక ప్రాంతం మీద
కొత్త పరిమితుల రేఖలు గీయబడతాయి

నాటకం గబగబా
ఆఖరి అంకానికి పరుగులు పెడుతుంది
కొన్ని నిట్టూర్పులూ కొన్ని నిర్లిప్తతలూ
నస పెడతాయి
పొద్దు గుంకిపోతున్నప్పుడైనా
నీ పాటేదో నువ్వు పాడుకోవచ్చుగా అని
మనసు ఒకటే పోరు పెడుతుంది
ఇక తెగించి రెక్కలు సవరించుకుంటాను
అప్పుడే
కాలం నా చుట్టూ
చిట్టచివరి చీకటి తెర దించేస్తుంది

జీవితం పొడుగునా
ఇంటిళ్లపాదికీ
అందమైన కవితలల్లుతూ అలసిన నేను
అప్పుడిక
నా సమాధి మీద చెక్కేందుకొక
శూన్యకవితను రాసిపెట్టుకోవాలి!