ఎవరో.... ఏ ఊరో...

కావేరిపాకం రవిశేఖర్‌
9849388182


అప్పుడు
సమయం సాయంత్రం ఆరో.... అరున్నరో అయింది. రోడ్డు సైకిళ్ళు, ఆటోలు, కార్లతో ఒకటే హడావుడిగా వుంది. అప్పటిదాకా మేసిన పిట్టలన్నీ గూళ్ళకు మళ్లాయి. సూర్యుడ్ని పడమటి దిక్కు నెమ్మదిగా మింగుతోంది. చీకట్లు నెమ్మదిగా నలుపు రంగు చల్లుకుంటూ వస్తున్నాయి. ఎటు చూసినా నల్లని చీకటి కాటుక బాగా కరిగించి ఆ నీళ్లు దిమ్మరించినట్లుంది. అది ఆ నగరాన్ని నెమ్మదిగా తన కౌగిట్లోకి లాక్కుంటోంది.
ఆ రోడ్డు ఎప్పుడూ విపరీతమైన రద్దీగా వుంటుంది. ఓ పక్క ఎప్పుడూ జనంతో రద్దీగా వుండే సూపర్‌ మార్కెట్‌, దాని కెదురుగా సాయిబాబా గుడి, దాని ముందు పెద్ద రావిచెట్టు. దానికి కాస్త దూరంగా ఓ సినిమాహాలు, మరికాస్త ముందుకెళ్తే రాములోరి గుడి. జనం.... జనం..... ఒకటే జనం ఎటు చూసినా జనం.
సమయం 9.00 గంటలు కావస్తోంది. సాయిబాబా గుడిలో ఇంచుమించుగా ఆఖరి హారతి పూర్తి కావొస్తుంది. ట్యూషన్లు వదిలిన పిల్లలు వాడిపోయిన పువ్వుల్లా వచ్చి ప్రసాదం తీసుకు వెళ్తున్నారు. ఓ ఇద్దరు పిల్లలు మాత్రం ఎందుకనో కొట్టుకుంటున్నారు. గుడి ముందరి బిచ్చగాళ్లు ఎవరూ చూడకుండా డబ్బు లెక్కబెట్టుకుంటున్నారు.

గుడి పూజారి గుడి మూసి మిగిలిన ప్రసాదాన్ని అక్కడున్న బిచ్చగాళ్ళందరికీ పంచాడు. ఎంత ఆకలిగా వున్నారోగాని ఆ ప్రసాదాన్ని వాళ్ళు ఆబగా తిన్నారు. పూజారి స్కూటర్‌ స్టార్టు చేసి ఇంటికి పోబొతుండగా ఓ కుక్కపిల్ల కుయ్‌.... కుయ్‌... మంటూ తోకాడించుకుంటూ పూజారి పాదాలు నాకింది. పూజారి స్కూటర్‌ డిక్కిలోని ప్రసాదాన్ని దానికి కొంత పెట్టాడు. దాన్ని తిని అది తృప్తిగా వెళ్ళిపోయింది. పూజారి బయల్దేరి వెళ్ళిపోయాడు.

నగరం నెమ్మదిగా నిశ్శబ్దమనే చీరను కట్టుకుంది. చల్లగాలికి రావిచెట్టు తలవూపుతున్నట్టుంది. ఎక్కడో మెరుస్తున్న మెరుపుల వెలుగు ఆరి వెలుగుతున్న ట్యూబ్‌లైట్‌లా వుంది. సెకండ్‌ షో మొదలైనట్టుంది. ఆ గుడి ముందరి చెట్టు కింద పేవ్‌మెంట్‌పై కొచ్చారు. కొందరు ముసలి బిచ్చగత్తెలు. అందరూ పగలబడి నవ్వుతూ బిగ్గరగా మాట్లాడసాగారు.

వాళ్ళలో ఒకావిడేమో బొడ్లోని చిన్న సంచి తీసి ఒ పొగాకు కాడ, వక్కపలుకు నమలసాగింది. చేతిలోకి తమలపాకు తీసుకుని చీరకు తుడుచుకుని సున్నం రాసి నములుతూ, గారపట్టిన పళ్ళతో నవ్వుతూ మాట్లాడుతోంది.

గుడి మీదున్న పావురాలు గుర్‌... గుర్‌ మంటున్నాయి. ఒకామేమో ముక్కుకున్న రెండు బేసర్లతో (పెద్ద ముక్కుపుడకలు) ముక్క ఎగబీలుస్తూ, ఎర్రగా పండిన తాంబూలపు ఎంగిలిని తుపుక్కున్న వుమ్మింది. వాళ్ళలో ఒకామె మొహం కడుక్కుని విభూతి పెట్టుకుని వచ్చింది.

రాగానే వూర్లో నా మనవడెట్టున్నాడో అంటూ బాధగా చెప్పింది సరస్వతి. బాగానే వుంటాడ్లే సరసా అంది మరోకావిడ. అక్కడ ఎవరూ ఎవరికీ తెలియదు. అయినా ఏదో తెలియని ఆత్మీయత వాళ్ల మధ్యన పెనవేసుకుంది. వాళ్ళు సరస్వతి (సరసా), ఎంగట లక్ష్మి, కమిలి, శాంతమ్మ, సుశీలమ్మ.

అప్పుడు సరస్వతి చెబుతూ మావూర్లో వరసగా ఏడెండ్లు కరువొచ్చింది. బావులు, చెరువులు అన్నీ ఎండిపోయాయి. గడ్డిపోస గూడా మొలవడంలే. దాంతో జరుగుబాటు లేక కొంతమంది పట్నానికి కూలిపనులకి బోయినారు. కొందరేమో వొడే గొడ్డుగోదా ఒకటి సగానికి అమ్ముకోని బతకతా వుణ్ణారు. రైతులు ఆకాశం చూస్తానే వుండారు. చినుకు రాలక నోళ్లు దెరుచుకున్న నేల ఆకాశం సాయి ప్రాణాలుగ్గబట్టుకొని జూస్తావుండాది.

ఎవురో పక్క కయ్యిలోళ్లకి పవర్‌ బోర్‌ యేస్తే నీళ్లుబడ్డాయని నా కొడుగ్గూడా అప్పుదెచ్చి  బోరెయిపిచ్చినాడు. వందలడుగులు బోయినాగాని నీళ్ళు బడ్లే. రెండు లక్షలు దాకా అప్పైపోయినాడు. రోజురోజుకి వడ్డీలు బెరిపోయినాయ్‌. బిత్తరపోయి వాడేమో మందూ (పురుగుమందు) దాగేసినాడు. నా కోడల్ని, మనవడ్ని, ఆడ్నే బేట్టినా లేకపోతే అప్పులోళ్ళు ఒప్పుకుంటారా? అని దీర్ఘంగా నిట్టూర్పూ విడిచింది. ఇంతకి మీదే వూరూ అని మరొకామె అడిగితే ఊరి పేరు చెప్పలా.... అభిమానం అడ్డంబడ్డాది.

ఆ తర్వాత కమిలి (కమ్మలమ్మ అయితే) చెప్తోంది. నాకు ఒక్కగానొక్క కూతురు. మా ఆయన్ని లారీ గుద్దేసి సచ్చిపోయినాడు. మాకుండేది 4 కుంటల కయ్యి. దాంతోనే గుట్టుగా బతుకుణ్ణ్యాం.... నా కూతుర్ని కష్టపడి కూలినాలి జేసి చదివిస్తున్నా. కాలేజికి బోతుణ్ణింది. అసలేం జరిగింది ఏమో గాని ఒకరోజు ఎవురికి జెప్పకుండా ఎట్నో వెళ్ళిపోయింది. చుట్టుపక్కల వూళ్ళన్నీ వెతికిన గాని లాభం లేకపోయింది. వాళ్ల స్నేహితులు సినిమాల్లోకి బోయ్యిందని కొందరు? ఉద్యాగానికి బొంబొయి బొయ్యిందని కొందరన్నారు? ఊర్లో రకరకాలుగా అంటుండేసరికి ఇంక అక్కడుండలేక వొచ్చేసినా ఇట్టా దూరంగా... దూరంగా అని యేడస్తుంటే నీ కూతురు కనిపిస్తాదిలే అంటా మరో ముసల్ది ఓదారుస్తోంది బాధగానే.

ఎంగటలచ్మి కళ్ళల్లో నీళ్ళు దిరిగి ఇట్ట జెప్తావుండాది.... మేము చానా దూరాన కొండకిందపల్లెలో వుండేవోళ్ళం. నేను మా ఆయన, కొడుకు, కోడలు సేపలుపట్టి అమ్ముకొనేవోళ్ళ. లచ్చినంగానే బతుకుతున్న.  యాడుణ్ణిందో ఈ దొంగలంజాముండ కోరువొచ్చింది. చినుకు బడ్తేగదా. యేడాడ్నో వుండే గుంటలు, బాయిలు, సెరువులు ఎండిపోయే, నీసులు లేకపోతే సేవలాడుంటాయా?

మాకా కాలుజెయ్యి ఆడ్తే గదా. ఎట్ట బతకబోతామబ్బా అని దిగులుపబడి బోతుంటికి ఇంతలో ఇటికిరాయి లారిలో కూలిపనికి కుదురుకున్నారు. అబ్బాకొడుకులిద్దరూ, బాగా డబ్బులొచ్చేది. ఇద్దరికి తాగుడెక్కువైంది. ఓ రోజు లోడుతో బోతుంటే లారి పల్టీగొట్టి పౖౖెనుండే ఆయన మీద రాళ్ళు బడి సచ్చిపోయినాడు. గవర్మెంటోళ్ళు డబ్బిస్తే తాగి తాగి నా కొడుకు సచ్చిపోయినాడు. కోడలేమో దాని దారి అది సూసుకుంది. ఒంటి పచ్చినైపోయ్యి ఈడ బడి వస్తావుండా అంటా యేడస్తుంది ఎగంటలచ్మి.

నొసటన విభూతిపెట్టుకున్న శాంతమ్మ కళ్ళల్లో నీళ్లు రాలేదుగాని, ఆమె ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్పు విడిచి ఇలా చెప్పసాగింది. మాకు పాతిక ఎకరాల బత్తాయి తోట, ఇంటినిండా పాడీ మా పరిస్థితి బాగుండేది. నాకు ఒక్కనొక్క కొడుకు, వాడ్ని పట్నంలో ఇంజనీరింగ్‌ చదివిస్తున్న ఆయన కాలం చేసి నాలుగైదేళ్ళయ్యింది. ఏమైందో ఏమో గాని ఓ రోజు ఇంటికి వచ్చాడు. ఆ రోజంతా బాగా నవ్వుతా మాట్లాడినాడు. కూరగాయలు తరగతుండి వేలు తెగితే ఆ రోజు అన్నం వాడే తినిపించాడమ్మా అంది కాసింత ఉద్వేగంగా.

తెల్లవారేసరికి ఇంటి ముందున్న వేపచెట్టుకి ఉరేసుకొని వేలాడుతుండాడు. పదిరోజుల తర్వాత తెలిసింది. అప్పటికే వాడు చెడ్డ అలవాట్లు నేర్చుకున్నాడని, కిరకెట్‌లో పందాలుగట్టి లక్షలు అప్పులైపోయినాడని. ఇల్లు, పొలాలు అన్నీ అమ్మేసి అప్పులన్నీ కట్టేసినా, నా అన్న వాళ్ళంతా ఎవరూ ఆదుకోలా, రైలెక్కి ఇట్లా దూరంగా వచ్చేసినా, నాకెవరూ లేరు... నాకెవరూ లేరు అంటూ బాధగా గొణుక్కుంటోంది శాంతమ్మ.

ఇంక జాల్లేండి ఏడుపులు, దుఃఖాలు ఒకటే సోది జెప్తావుండారుగాని  పడుకోండంటూ కసిరింది. సుశీలమ్మ. పైకి అలా అందేగాని లోపల ఆమెకు బాధగానే వుంది. అందరూ ఆ పెవ్‌మెంట్‌పైనే ప్యాకింగ్‌ ఆట్టలు పరుచుకొని పాత దుప్పట్లు కప్పుకొని పడుకున్నారు.

చల్లగా గాలి తోలుతోంది. సెకండ్‌ షో వదిలేశారేమే రోడ్డంతా నిర్మానుష్యమైపోయింది. ఆకాశంలో ఓపక్క నెమ్మదిగా మబ్బులు కమ్ముకుంటున్నాయి. నక్షత్రాలు దూరంగా బిక్కు బిక్కుమంటున్నాయి. అక్కడంతా ప్రశాంతంగా వుంది. ఎంత ప్రశాంతంగా వుందంటే ఆ నిశ్శబ్దాన్ని చూసి చీకటే భయపడేంతగా వుంది.

అంతా నిశ్శబ్దం.. అంతా ప్రశాంతం.. నిద్రిస్తున్న వాళ్ళ మొహాలు పసిపాపల నవ్వుల్లా వున్నాయి. అంటే ఎక్కడ్నుంచి వచ్చిందోగాని గరుత్మంతుడు పాములాగా వేగంగా వచ్చిందో ఇసుక లారీ. పేవ్‌మెంట్‌ పైకి ఎక్కింది. అంతే ఓ చిన్న మూల్గు... ఎక్కడి వాళ్ళక్కడే చిద్రమైపోయారు. ఆ ప్రాంతమంతా రక్తంతో తడిసిపోయింది. ఆ రక్తంలో విసిరేసినట్టు చిల్లర డబ్బుల్తో చెల్లాచెదురైన శరీరభాగాలతో యుద్ధరంగంలా వుంది అక్కడి పరిస్థితి.

ఆ భయంకర దృశ్యం చూసిన మబ్బులు బావురుమంటూ కన్నీరు కార్చాయి. ఆ విలయానికి తట్టుకోలేని గాలి, చేష్టలు ఆపి బిగుసుకుపోయింది.

తాగిన మత్తులో వున్న డ్రైవర్‌ లారీతో వెళ్లిపోయాడు. దాని ఓనర్‌ ఎవరో? ఎవరితో మాట్లాడాడో గాని కేసు ఊసే లేకపోయింది. అలా ఆ నిర్భాగ్యుల జీవితాలు గాలిలో కలిసిపోయాయి.

వాళ్ళు ఎవరో... ఏ ఊర్లో ఎవరికి తెలియదు.... ఎప్పటికి తెలీయదు ఒక్క కాలానికి తప్ప.