మనసున మనసై

కథ

  కె. ఉషారాణి - 9492879210

  నిర్మలమయిన నీలాకాశం. సముద్రం అలలుకూడా ఈ రోజు అంతగా ఎగసిపడడం లేదు. ఆటుపోట్లు పెద్దగాలేవు. ఇంకా సూర్యుడు గుడ్‌బై చెప్పలేదు.  సూర్యకిరణాలకి అలలు మెరిసిపోతున్నాయి. ఏ నేతకారుడు తన   జలతారు తో  ఈ నగిషీలు చెక్కగలడా, ఏ చిత్రకారుడి ఊహ ఈ  ప్రతిరూపాన్ని తీర్చిదిద్దగలదా అని సవాలు చేస్తున్నట్టు ఉంది సూర్యాస్తమయం! ప్చ్‌! ఇంత వరకు ఇంతటి అద్భుతమయిన చిత్రాన్ని ఎన్నడూ చూడలేదు. ఎన్ని ఆర్ట్‌ ఎగ్జిబిషన్స్‌కి వెళ్ల లేదు!! ఆంటోనియో శాటిన్‌ ఈ చిత్రాన్ని గీయగలడా? చిత్రాన్ని ఇంత  మనోరంజకంగా  ప్రతిబింబించగలడా! ఏమో !!!

''ఐస్క్రీమ్‌ కావాలా మేడం'' తొమ్మిదేళ్ల లేత చేతులు ముందుకు పడుతున్న అడుగులకు అడ్డంగా నిలిచాయి.

వాచీ  చూసుకుంది. సరిగ్గా ఆరయింది. మధ్యాహ్నం లంచ్‌ అయిన వెంటనే పనిలో మునిగిపోవడం మొదలవుతుండగా ప్రదీప్‌ ఫోన్‌.

''లల్లీ! ఈ రోజు ఆరుగంటలకు మనం ఎప్పుడూ బీచ్లో కలుసుకునే చోటే కలుసుకోవాలి. అర్జంట్‌. డోంట్‌ డిసె పొయింట్‌ మి ! పని ఉందనకు. ఓకే'' అంటూ ఫోన్‌ కట్‌ చేసాడు. ఆర్డరో, అభ్యర్ధనో, రెండూనో! ఉన్న పనులన్నీ పక్కన పెట్టి వచ్చింది. మిగిలినవి వెళ్లి చేసుకోవాలి.

ప్రదీప్‌ని ఓ ఆర్ట్‌ ఎగ్జిబిషన్లోనే తొలిసారి చూసింది. సామాజిక స్పహతో వేసిన కళాఖండాలు తనని అబ్బుర పరుస్తుండగా, పక్కనే నిల్చుని ఉన్న ప్రదీప్‌ కనిపించాడు. అప్పుడు ఇద్దరూ చూస్తున్నది జగన్నాధ్‌ పాండా గీసిన చిత్రం. అదో మిక్స్డ్‌ మీడియా ఆర్ట్‌ వర్క్‌. తమ దేశంలోనే తమను పరాయి వారిని చేస్తే మనుషులు ఎలాంటి భావాలకు గురవుతారో చక్కగా చిత్రీకరించినది. మనుషులను ఆలోచింప చేస్తుంది. పుట్టి పెరిగిన ఊరు నీది కాదంటే  మనుషులు పడే వేదన, తన ఊరేదో  తెలియక పడే మానసిక సంఘర్షణ  చూపించిన చిత్రం. అందుకే మనుషులందరినీ తాళ్లతో శూన్యంలో చూపించారు ఆ చిత్రంలో. మనుషుల కోసం భూమి ఉందా? భూమికోసం మనుషులున్నారా? దేశాల హద్దులు మనం గీసుకున్నవి కావూ?!

ఐస్‌ క్రీం అబ్బాయి ఇంకా కదలలేదు. ప్రదీప్‌ రాలేదు.

  •  

''మీకు కూడా ఆర్ట్‌ ఎగ్జిబిషన్స్‌ చూసే అలవాటు

ఉందా? ఈ మధు ఆర్ట్‌ సెంటర్‌లో పెట్టే ప్రతి ఎగ్జిబిషన్‌ నేను చూస్తాను. కానీ మిమ్మల్ని చూడ్డం  ఇదే మొదటి సారి'' మాట కలిపాడు.

''ఔను నేను రావడం ఇదే మొదటిసారి'' ఈ మధ్యే ఈ ఊరు ట్రాన్స్‌ఫర్‌ మీద వచ్చాను. మాది చెన్నై.''

''ఓ ! నైస్‌ మీటింగ్‌ యు ! వెల్కమ్‌ టు  విజయవాడ !! మాకు మరో ప్యాట్రన్‌ దొరికారు అనుకోవచ్చా! నా  పేరు ప్రతాప్‌. నేను లైలాకాలేజి లెక్చరర్ని. మీ పేరు తెలుసు కోవచ్చా?''

'' నా  పేరు లలిత.  నేను స్టేట్‌బ్యాంక్‌లో ఆఫీసర్ని. ''గ్లాడ్‌ టు  మీట్‌ యు'' కాస్త ముభావంగానే చెప్పింది.

పరిచయాలు అయిన తరువాత తను ఎగ్జిబిషన్‌ చూసి ఇంటికి వచ్చేసింది.

మళ్ళీ రెండో నెలలో అనుకుంటా .. ఎం ఎఫ్‌ హుస్సేన్‌ ఎగ్జిబిషన్‌ పెట్టినట్టు పేపర్‌లో చూసి వెళ్ళింది మధు ఆర్ట్‌ సెంటర్‌కి. ప్రదీప్‌ అక్కడే  ఉన్నాడు.

ఆలా ప్రారంభమయిన పరిచయం కొన్ని రోజులకి బయట కూడా కలవడం, కాలక్షేపం కబుర్లు చెప్పుకోవడం వరకు వచ్చింది.

ప్రదీప్‌ మంచి మాటకారి. ఎవరికి ఏ సహాయం అవసరమైనా అందుకుని చేసే  నైజం కూడా. ఇద్దరికీ పుస్తకాలు చదవడం, చిత్రలేఖనం ఇష్టం. అందుకే ఇద్దరూ ఎప్పుడు కలిసినా టైం తెలియదు. ఆఫీస్‌లో ఎంతమంది ఉన్నా ఒంటరిగా అనిపించే లలితకి, ప్రదీప్‌ ఒక్కడితో ఉంటే కాలమే తెలియదు, ప్రపంచం హరి విల్లులాగా అనిపిస్తుంది. ప్రదీప్‌ సేన్‌గుప్తా చిత్రాలలాగే.

''హలో, హలో!'' ప్రదీప్‌ గొంతు ఆలోచనలకు  అంతరాయం కల్పించింది. ఐస్క్రీమ్‌ అబ్బాయి ఓ రౌండ్‌ వేసి మళ్లి  వచ్చినట్టుంది. ప్రదీప్‌ని నా పక్కన చూసి కొనిపించి తీరవలసిందే అని ఫిక్స్‌ అయినట్టు ఉన్నాడు.

''రెండు ఇవ్వు''  ప్రదీప్‌.

'' రా, కూచుని మాట్లాడు కుందాం.'' ప్రదీప్‌.

''ఏమిటిట ఇంత అర్జెంట్‌'' లలిత.

''.... ''

''కానీ , ఈ సస్పెన్సు ఏమిటి ?'' లలిత.

''సరే, డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వచ్చేస్తున్నా'' ప్రదీప్‌.

''ఏం లేదు లల్లి ! మనం ఇన్ని రోజుల నుంచి ఒకరి నొకరం తెలుసుకున్నాం. మంచి స్నేహితులం అయ్యాం. ఈ బంధం శాశ్వతం చేసుకోవచ్చుకదా ! అమ్మ ఈ రోజు ఒక మ్యారేజ్‌ ప్రపోజల్‌ తెచ్చింది. నీతో ఆ విషయం మాట్లాడాలని,  నీ అభిప్రాయం తెలుసుకుని తరువాతే  ఆమెకి సమాధానం చెప్పాలని పించింది .. ఏమంటావు ?'' ప్రదీప్‌.

ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది.

'' ఫరవాలేదు, లల్లి, నీ సమాధానం ఏదయినా నేను అర్థం చేసుకోగలను. నాకు నీ అభిప్రాయం ఏ  సందేహాలు లేకుండా చెప్పవచ్చు'' ప్రదీప్‌.

ప్రదీప్‌ కళ్ళలోకి చూసింది లలిత.

ఈ మాటలు నిజమేనా? ఆ కళ్ళు ఏం  చెపుతున్నాయి?  నా గతం  తెలిసిన తరువాత ఇప్పుడున్న బంధం కాస్తా తెగిపోదు కదా! మళ్ళీ తాను ఒంటరిది అవదుకదా !! ఏ క్షణం వస్తుందని భయపడిందో, రాకుండా ఉంటే బాగుండును అనుకుందో ఆ క్షణం రానే వచ్చింది. ఒక్క క్షణం ఆందోళన పడ్డా  వెంటనే తేరుకుంది. మనసున్న మనిషి తోడు కావాలిగాని కేవలం ఓ మగతోడు కాదు తనకు కావలిసింది. అందుకే ఎవరిని పెళ్లి చేసుకున్నా ఈ విషయం చెప్పి చేసుకోవాలనే అనుకుంది తను.  సహదయుడు స్నేహశీలి కాని వాడి సాహచర్యం తాను భరించలేదు. ఆలోచనలకు ఫుల్‌స్టాప్‌ పెట్టమన్నట్టు  ఇసుకలో ఉన్న  తన చేతిమీద చేయి వేసాడు ప్రదీప్‌. కాసేపు చేతిలో వేసిన చేయి మరింత గట్టిగా పట్టు బిగించింది.

లలిత కళ్ళు ఇసకనే చూస్తున్నాయి. పాదాలను సుతారంగా తాకుతూ చడీచప్పుడు లేకుండా కింద ఉన్న ఇసుకను తమతో తీసుకు పోతున్నాయి అలలు.

ఓ నిట్టూర్పు విడిచి లలిత మళ్ళి ప్రదీప్‌ కళ్ళలోకి చూసింది. ఈ సారి చూపులో బిడియం లేదు.

''ప్రదీప్‌ ! మన మధ్య ఇటువంటి ఓ సమయం వస్తుందేమో అని నేను అనుకుంటూనే ఉన్నాను. ఈ రోజు రావడం కూడా  మంచిదేలే ! నేనెవరిని పెళ్లి చేసుకున్నా ఈ విషయం ముందు చెప్పే చేసుకోవాలనుకున్నాను. ప్రతి మనిషికి పెళ్ళికి ముందు ఓ గతం ఉంటుంది కదా ! అలాగే నాకో మరిచిపోవాలనిపించే  గతం ఉంది. నా గతంతో నీకు సంబంధం లేదని అనుకోకు. గతం ఎప్పుడూ మనిషిని వెన్నాడుతూనే ఉంటుంది. అయితే నన్ను నన్నుగా  హదయ పూర్వకంగా స్వీకరించగలిగితే నాకేం అభ్యంతరం లేదు. నిన్ను మించిన స్నేహితుడు నాకు ఇప్పటి వరకు తారసపడలేదు.

''మన సమాజంలో స్త్రీకి పురుషుడికి విలువలు నిర్ణయించడంలో చాల వ్యత్యాసం ఉంటుంది కదా. పురుషుడికి చదువు, తెలివితేటలూ, హోదా, ఆస్తి ఉండడం మంచి వరుడి అర్హతలు. మిగిలినవన్నీ సర్దుకోవచ్చు. కానీ స్త్రీ విషయానికి వచ్చేసరికి  వీటన్నీతోపాటు, అంతకంటే ముఖ్యంగా కూడా  ఆమెకు కన్యత్వం ఉండాలి. ఇంటి గౌరవం అంటే స్త్రీ శీలం అని ఇప్పటికీ చలామణి అవుతున్నది. దానిని కాపాడు కొనే భాద్యత  ఆమెది,  ఆమెను కన్నవారిది. కానీ ఈ సమాజం లో స్త్రీ భద్రతకి గ్యారంటీ మాత్రం లేదు. స్త్రీల విషయంలో  తప్పొకరు చేస్తే శిక్ష మరొకరికి. ఆనాటి శకుంతలయినా, సీతయినా, అహల్య అయినా ఈనాటి ఆధునిక మహిళ అయినా స్త్రీ ని సమాజం చూసే విషయంలో పెద్ద మార్పేమీ  రాలేదు. ఆనాటి నుంచి నేటి వరకు తన వ్యక్తిత్వం గుర్తించబడేందుకు స్త్రీ  ఘర్షణ పడుతూనే ఉంది.

ప్రదీప్‌ వింటున్నాడా లేదా అని ఓ సారి మొహం లోకి చూసింది.

ప్రదీప్‌ మౌనంగా వింటున్నాడు. ఏ రకమయిన భావం వ్యక్తం కావడం లేదు. కాస్త ఆపింది.

'ఊ చెప్పు' అన్నట్టు ఉన్నాయి కళ్ళు. మళ్ళీ మొదలు పెట్టింది లలిత. '' మాఊరు తాంబరం. చెన్నై దగ్గరే. మానాన్న తాంబారంలోని మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో తోటమాలి. కాలేజీ పక్కనే ఉన్న ఓ చిన్న ఇంట్లో మేము ఉండేవాళ్ళం. నాన్న నన్నెంతో ప్రేమతో పెంచారు. ఆ కాలేజీలో నేను లెక్చరర్‌ అవ్వాలని కలలు కనేవారు. అప్పుడు నేను నాలుగో తరగతి చదువుతున్నాను. ఆ కాలేజీ నాకు ఇల్లులాగా ఉండేది. స్కూల్‌కి వెళ్ళని సమయమంతా అక్కడే గడిపేదానిని. అమ్మ మా ఇంటిపక్కనే ఉన్న ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా ఉండేది.

''ఒక రోజు అమ్మ స్కూల్‌ కి వెళ్ళింది. నాన్న పనిమీద బయటికి వెళ్ళాడు. కాలేజీకి కూడా సెలవే. కానీ అక్కడే నేను ఆడుకుంటున్నాను. కాలేజీ ఇంగ్లీష్‌ లెక్చరర్‌ సంపత్‌. నాన్న ఒకసారి నన్ను వాళ్ళింటికి తీసుకెళ్లారు. వాళ్ళింటి గార్డెన్‌ కూడా నాన్నే చూసేవారు.  ఆయన చాలా సరదాగా ఉంటారు. మంచి కధలు చెప్పేవారు. నాకు చాక్‌ లెట్లు కూడా కొని ఇచ్చే వారు. తాను ఇంటి కెళుతూ నన్ను రమ్మన్నారు. నాతో  ఆడుకునే పిల్లలంతా కూడా వెళ్లిపోయారు. నేను  ఆయనతో పాటే  వాళ్ళింటికి వెళ్ళాను.

ఇంట్లో నాకు స్వీట్స్‌ ఇచ్చారు. ఆంటీ ఇంట్లో లేరని నాకు అప్పుడు అర్థం అయింది. కాసేపాగి నేనిక వెళతానని లేచాను. కానీ మాష్టారు కూల్‌ డ్రింక్‌ తాగి వెళ్ళమని తెచ్చి ఇచ్చారు. నేను తాగడమే నాకు గుర్తుంది. ఆ తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు.  తరువాత నాకు మెలుకువ వచ్చి చూసే సరికి మాస్టారి పక్క పై ఉన్నాను. నాకు భయం వేసి లేవబోయాను. కానీ లేవలేకపోయాను. చెప్పలేని బాధ. నెమ్మిదిగా ఓపిక చేసుకుని లేచి చూస్తే మాస్టారు లేరు.

వాచ్‌ మాన్‌ నన్ను చూసి నవ్వి నేను బయటికి రాగానే  తాళం పెట్టుకుని వెళ్ళిపోయాడు.

''ఇంటికి వెళ్లి నాన్నతో నేను జరిగిన విషయం చెప్పాను. అమ్మ నాన్న ఒకటే ఏడుపు. ఎందుకేడుస్తున్నారో నాకు అర్థం కాలేదు. అంతకు ముందు నాకు ఎన్నోసార్లు  జ్వరాలు వచ్చాయి. ఒంట్లో నలత చేసింది. డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లారు. ఎప్పుడూ నాకే ధైర్యం చెప్పేవారు. గాయాలకు భయపడకూడదనే వారు.  కానీ ఇప్పుడు అమ్మ నాన్న ఏడుపు నన్ను ఎంతో కలవర  పెట్టింది. చివరికి ఒక డాక్టర్‌ ఆంటీ దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టరుగారు లెక్చరర్‌ని తెగ తిట్టింది. పోలీస్‌లకు కంప్లైంట్‌ ఇవ్వమనింది. అయినా నాన్న అటువంటి పనేం చేయలేదు. నా చుట్టూ ఏం జరుగుతున్నదో నాకు అర్థం కాలేదు.

ఆ  తరువాత  అమ్మ నాన్న బయటికి మామూలుగానే ఉన్నా దిగులుగానే ఉండేవారు. నన్నేమి అనలేదు కానీ ఆ తరువాత ఎప్పుడూ నాన్న నన్ను కాలేజికి తీసుకెళ్లలేదు. నాతో  సరిగ్గా మాట్లాడేవారే కాదు. నాకంతా  అయోమయంగా

ఉండేది. మూడేళ్లు గడిచిన తరువాత, నేను పెద్దదాన్నయిన తరువాత  మాత్రమే ఏమి జరిగి ఉంటుందో ఉహించగలిగాను.  నాన్న ఎవరికీ చెప్పుకోలేక,  ఆ బాధతో కుంగి పోయారు. ఆ బాధతోనే నేను ఇంటర్‌ చదువుతుండగా కన్నుమూశారు. టెంత్‌లో బాగా మార్కులు వచ్చాయి కాబట్టి   స్టేల్లాకాలేజీలో సీట్‌ వచ్చింది. నేను చేరాను. కాలేజీ టాపర్‌గా  డిగ్రీ ముగించాను. అమ్మ ఆరోగ్యం దృష్ట్యా చదువుకు స్వస్తి చెప్పి ఉద్యోగం చేయాలనుకున్నాను. నాన్న కల కలగానే

ఉండిపోయిందనుకో.  ఇదిగో  ఇలా  డిగ్రీ అవగానే బ్యాంకు ఉద్యోగానికి సెలెక్ట్‌  అయి చేరి పోయాను. చెన్నైలో

మూడేళ్లు చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. నాన్న పోయిన బెంగతో  అమ్మకి అనారోగ్యం ఎక్కువయింది. ఇప్పుడు నేనే మా కుటుంబానికి ఆధారం. నా గతాన్ని చెరపలేను. నిజానికి జరిగిన దానిలో నా ప్రమేయం లేదని, అది కేవలం ఒక గాయమని నేను గట్టిగా నమ్ముతున్నాను. అలా అనుకోగలిగిన వ్యక్తినే నా జీవిత భాగస్వామి చేసుకోవాలనుకున్నాను. మా అమ్మ నాన్న కూడా అలాగే అనుకునుంటే బాగుండేది. ఈ విషయాన్ని నన్ను పెళ్లి చేసుకోబోయే వారెవరైనా వాళ్ళ దగ్గర దాచకూడదని అనుకున్నాను. అందుకే నీకు చెప్పడం.  నువ్వు ఆలోచించుకుని నిర్ణయం తీసుకో'' చెప్పడం ముగించి పరుగులెడుతున్న అలలను చూస్తూ కూచుంది లలిత.

ఆ అలలు ఇలాంటి కథలెన్నో తాము విన్నామని చెపుతున్నట్టు అనిపించింది. ''ఎందరిని నేను కలపలేదు. ఎందరు నా సాక్షిగా విడిపోలేదు. ఫరవాలేదు. ముందుకు వెళ్ళవలసింది నువ్వు''  అని ధైర్యం చెపుతున్నట్టు పరుగున వచ్చి కాళ్ళు తాకుతున్నాయి. ముందు కన్నా ఇప్పుడు అలల ఉధ తి పెరిగింది. సూర్యుడూ సముద్రం మాటున దాక్కున్నాడు. శరత్చంద్రుడు చిరునవ్వు నవ్వుతున్నాడు. నక్షత్రాలు చుట్టూ చేరి వయ్యారాలు ఒలక బోస్తున్నాయి. నిశ్శబ్ద సంగీతం వీనుల విందు చేస్తోంది.

లలిత చేయి తీసుకుని ప్రదీప్‌ గుండెలకి హత్తుకున్నాడు. ఆ చేయి వెచ్చగా మెత్తగా ఉంది. ఇద్దరి ఉఛ్వాస నిచ్ఛ్వాసలు సముద్రపు హోరుతో సయ్యాటలాడుతున్నాయి.

''పద. అమ్మను రేపు కలుద్దాం, నిన్ను పరిచయం చేస్తాను''  అంటూ ప్రదీప్‌ లలితను ఆఫీస్‌లో వదిలి పెట్టాడు.

ఎవరో పాత పాటలు పెట్టుకున్నారు కాబోలు. శ్రావ్యంగా ఘంటసాల గొంతులో నుంచి  ''మనసున మనసై బతుకును బతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గమూ..'' పాట వినిపిస్తోంది. లలిత ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఆఫీస్‌ లోకి అడుగు పెట్టింది. రేపు ప్రదీప్‌ వాళ్ళ అమ్మను కలవడానికి వెళ్ళేటప్పుడు ఏం డ్రెస్‌ వేసుకోవాలా అని ఆలోచిస్తూ ...