విజయవాడలో గుర్రం జాషువా 48 వ వర్ధంతి

విజయవాడలో ఎం.బి. విజ్ఞానకేంద్రంలో గుర్రం జాషువా వర్ధంతి సభలో ప్రసంగిస్తున్న సర్వశిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, ప్రముఖ రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు. చిత్రంలో సాహితీస్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు వొరప్రసాద్‌, కెవిపిఎస్‌ నాయకులు నటరాజ్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దడాల సుబ్బారావు, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్‌.

విజయవాడలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో కెవిపిఎస్‌, ప్రజానాట్యమండలి, సాహితీస్రవంతి ఆధ్వర్యంలో జూలై 24న గుర్రం జాషువా 48వ వర్ధంతి సభ జరిగింది. కెవిపిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు నటరాజ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సర్వ శిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, ప్రముఖ రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు పాల్గొన్నారు. జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ కవికోకిల, నవయుగ చక్రవర్తి గుర్రం జాషువా గొప్పతనాన్ని దేశానికి చాటి చెప్పాల్సిన బాధ్యత తెలుగు వారిపై ఉందని అన్నారు. జాషువా పద్యాల్లో అధ్బుతమైన సాహిత్య విలువలు ఉన్నాయని, ఆయన రాసిన 'క్రీస్తు చరిత్ర' పద్యకావ్యం సాహిత్య విలువల పరంగా గొప్ప పుస్తకమని పేర్కొన్నారు. 20వ శతాబ్దపు కవులను పదిమందిని తీసుకుంటే వారిలో జాషువా ఒకరిగా నిలుస్తారని అన్నారు. పద్యాల్లో పదాల పొందికలో జాషువా అందువేసిన చెయ్యి అన్నారు. సాహితీస్రవంతి రాష్ట్ర అధ్యక్షులు వొరప్రసాద్‌ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో జాషువాది విలక్షణ స్థానమని అన్నారు. స్వీయజీవితంలోని సామాజిక దుర్మార్గాన్ని శక్తివంతమైన సాహిత్యంగా మలచారని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ వ్యవస్థలోని దుర్మార్గాన్ని తన సాహిత్యం ద్వారా జాషువా ప్రజల్లోకి తీసుకెళ్లారని అన్నారు. సమగ్రదృష్టితో జాషువా సాహిత్యాన్ని రచయితలు అధ్యయనం చేయాలని అన్నారు. అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో కె.ఎక్స్‌. రాజు, వారాల అజయ్‌, శాంతిశ్రీ తదితరులు స్వీయ కవితా పఠనం చేశారు. కొండపల్లి మాధవరావు, డి.వి.ఎస్‌. రాజు జాషువా పద్యాలు పాడి సభికులను ఆకట్టుకున్నారు.  ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్‌, కెవిపిఎస్‌ నాయకులు ఆండ్ర మాల్యాద్రి  కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.