విశాఖపట్నంలో జాషువా వర్ధంతి సభ

    

విశాఖపట్నంలో సిఐటియు కార్యాలయంలో జూలై 24న గుర్రం జాషువా వర్ధంతిని పురస్కరించుకుని కెవిపిఎస్‌, గిరిజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో 'జాషువా కవిత్యం - సమకాలీనత' అంశంపై సదస్సు జరిగింది. సాహితీస్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్‌ ముఖ్య అతిథిగా హాజరయి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ జాషువా కాలంనాటి కవులంతా భావకవిత్వం రాస్తుంటే దానికి భిన్నంగా కులవివక్ష, అంటరానితనంపై కలాన్ని జాషువా ఎక్కుపెట్టారన్నారు. ఒక దళితుణ్ణి కథానాయకుడిగా తీసుకుని 'గబ్బిలం' కావ్యాన్ని రాశారన్నారు. స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్ళు గడిచినా నేటికీ వివక్ష కొనసాగడం దారుణమని అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ గుర్తింపు యూనియన్‌ ప్రధాన కార్యదర్శి వై.టి. దాస్‌ మాట్లాడుతూ జాషువా దళితుడిగా పుట్టడం వల్ల మహాకవి అయినా అవమానాలు ఎదుర్కొన్నారని అన్నారు. రాష్ట్ర గిరిజన ఉద్యోగుల సంఘం

ఉపాధ్యక్షులు బి. తౌడన్న మాట్లాడుతూ సమాజంలో అసమానతలు, కులమత బేధాలపై ప్రజలను చైతన్యపరిచిన వేమన, గురజాడ, కందుకూరి, జాషువా వంటి కవుల రచనలు సామాన్య ప్రజలలోకి విస్త ృతంగా తీసుకెళ్ళాలని కోరారు. కెవిపిఎస్‌ స్టీల్‌ డివిజన్‌ కార్యదర్శి ప్రకాశ్‌ పరకుమార్‌ అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది.

విశాఖలో గుర్రం జాషువా వర్ధంతి

      విశాఖపట్నం సాహితీస్రవంతి ఆధ్వర్యంలో జూలై 24న ఎల్‌ఐసి ఎంప్లాయీస్‌ క్లబ్‌లో గుర్రం జాషువా 48వ వర్ధంతి సందర్భంగా 'జాషువా సాహిత్య పరామర్శ' అంశంతో సభ జరిగింది. సాహితీస్రవంతి విశాఖ గౌరవ అధ్యక్షులు ఎన్‌. రమణాచాలం అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రముఖ సాహిత్య విమర్శకులు ఆచార్య చందు సుబ్బారావు, ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆచార్యులు ఆచార్య యోహాన్‌బాబు పాల్గొని ప్రసంగించారు. గుర్రం జాషువా జాతీయ మహాకవిగా నిలుస్తారని, జాషువాని దళిత కవిగా చెప్పుకోవడం తగదని, కార్మికుల, కర్షకుల, దళితుల కష్టాలు, వివక్ష సమర్ధవంతగా ఎత్తి చూపారని, కుల,మత ద్వేషాలు, మూఢనమ్మకాలపై ధ్వజమెత్తారని అన్నారు. మొదటి సార్వత్రిక ఎన్నికలలోనే ధన ప్రభావాన్ని ప్రస్తావించి ఓటు విలువను చాటి చెప్పారన్నారు. సమాజ రుగ్మతలను తన కవితల ద్వారా చాటి చెప్పిన కవికోకిల జాషువా విశ్వనరుడని చందు సుబ్బారావు పేర్కొన్నారు. సాహితీలోకానికి వెలుగు చూపిన మహాకవి జాషువా అని యోహాన్‌బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ సాహితీస్రవంతి అధ్యక్షులు ఎ.వి. రమణారావు, శివకోటి నాగరాజు, సుజాతామూర్తి, పెంటకోట రామారావు తదతరులు నిర్వహణలో పాలుపంచుకున్నారు. చిన సూర్యనారాయణ, శివాజీ పట్నాయక్‌లు జాషువా పద్యాలు పాడి సభికులను అలరించారు.

కంచరపాలెంలో జాషువా వర్ధంతి సభ

      కంచరపాలెంలోని బొట్టా నర్సింగరావు భవన్‌లో జూలై 25న జాషువా వర్ధంతిని పురస్కరించుకుని సభ నిర్వహించారు. కవి ఫ్రాన్సిస్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో రంగస్థల నటులు రాములు, ఎ.వి. రమణారావు తదితరులు ప్రసంగించారు. జాషువా సాహిత్యం వర్తమాన సమాజానికి మరింతగా అవసరం ఉందని వక్తలు అన్నారు. పెంటకోట రామారావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేశారు.

 

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో సిఐటియు కార్యాలయంలో జరిగిన గుర్రం జాషువా వర్ధంతి సభలో ప్రసంగిస్తున్న సాహితీస్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్‌. చిత్రంలో వై.టి. దాస్‌, బి. తౌడన్న, చంద్రికారాణి, ప్రకాశ్‌ పరకుమార్‌.