శ్రీకాకుళంలో కందుకూరి శతవర్ధంతి సభ

      సమాజాన్ని వెనక్కినెట్టి మరింత మూఢత్వం, దోపిడీ, అణచివేతలో ప్రజలను ఉంచాలని అధికారంలో ఉన్న పాలకులు భావిస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా కందుకూరి స్ఫూర్తితో ప్రజలను కదిలించే ఉద్యమాలను నడపాల్సిన అవసరముందని మాజీ ఎమ్మెల్సీ, ప్రజాశక్తి దినపత్రిక సంపాదకులు ఎంవిఎస్‌.శర్మ అన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త, సాహితీవేత్త కందుకూరి వీరేశలింగం శతవర్థంతి సందర్భంగా జూన్‌ 30న శ్రీకాకుళంలోని స్థానిక బాపూజీ కళామందిర్‌లో శ్రీకాకుళం సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించిన 'సాహిత్య, సామాజిక, సాంస్క తిక సమాలోచనలు - చర్చలు' అనే సదస్సులో ఆయన

ఉపన్యసించారు. ప్రభుత్వం మనుధర్మ శాస్త్రం అమలు చేయాలనుకుంటోందని, ఈ తరుణంలో కందుకూరి అవసరం పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. ముస్లిము మహిళలకు అన్యాయం జరిగిపోతుందంటూ హడావుడిగా ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును తెస్తున్నారని, అదే బిజెపి కాశ్మీర్‌లో దిక్కూమొక్కూ లేకుండా పడిఉన్న హిందూ వితంతువుల మీద షబానా అజ్మీ 'వాటర్‌' అనే సినిమా తీయబోతుంటే భారతీయుల పరువు పోతుందంటూ గగ్గోలు పెట్టాన్నారని విమర్శించారు. దళితులపై దాడులు, హత్యలకు పాల్పడుతూ అవి లేవనెత్తితే పరువుపోతుందంటూ గోల చేస్తున్నారని చెప్పారు. హిందూ మహిళలకు సమానత్వం ప్రసాదించే హిందూ కోడ్‌ బిల్లును సవరించాలన్న అంశంపై బిజెపి పాలకులు మాట్లాడటం లేదని విమర్శించారు. స్త్రీ సమానత్వం అసంపూర్ణంగా ఉండడం వల్లే కందుకూరి సంస్కరణ ఉద్యమాలను గుర్తుచేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. ప్రభుత్వం భాష మీద కూడా దాడి చేస్తోందన్నారు. హిందీ తప్పనిసరి చేస్తూ యుజిసి గుట్టుచప్పుడు కాకుండా ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

మాతభాషను దూరం చేసే నూతన విద్యావిధానం తీసుకురావడం ద్వారా అశాస్త్రీయమైన దుర్మార్గమైన లాజిక్‌లు చెల్లుబాటు అవుతాయని పాలకులు భావిస్తున్నారని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో మందస జమిందారులకు వ్యతిరేకంగా పోరాడిన వీరగున్నమ్మ వీరోచిత పోరాట స్ఫూర్తిపై రెండు మూడు రోజులు ఉత్సవాలు నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. ఆంధ్రా యూనివర్సిటీ ఫ్రొపెసర్‌ కెపి.సుబ్బారావు మాట్లాడుతూ ప్రస్తుత బిజెపి పాలనలో స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కు లేకుండా పోయాయన్నారు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఇంత దారుణ పరిస్థితులు లేవని చెప్పారు. హిందూత్వ సిద్ధాంతం వల్లే మోడీ రెండోసారి గెలిచారని చెప్పారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సెక్యులరిజం కంటే వారికి మనుధర్మ శాస్త్రం ప్రామాణికమని విమర్శించారు. దేశంలో సాంస్క తిక సామ్రాజ్యవాదం నిర్మించాలని చూస్తున్నారని చెప్పారు. సాహితీ స్రవంతి శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి విజెకె.మూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో విశాఖ జిల్లా సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు ఎన్‌.శ్రీనివాసరావు, జనసాహితి ప్రధాన సంపాదకులు పిఎస్‌.నాగరాజు, రచయిత్రి పత్తి సుమతి, సాహితీ స్రవంతి నాయకులు డి.రామక ష్ణంనాయుడు, ఎన్‌ రమణారావు తదితరులు పాల్గొన్నారు.