కవిత్వం సామాజిక ప్రయోజనం కోసం రాయాలి - పక్కి రవీంద్రనాథ్‌

ఇంటర్వ్యూ

పాయల మురళీకృష్ణ - 8309468318

 •  రవీంద్రనాథ్‌ గారూ నమస్తే.. ఎక్స్‌రే జాతీయ కవితల పోటీలో అత్యుత్తమ బహుమతి పొందినందుకు ముందుగా అభినందనలు
  - ధన్యవాదాలు మురళీక ష్ణ గారు
 •  మీరు తొలిసారిగా కవిత్వం రాయడానికి ఎప్పుడు పూనుకున్నారు దానికి ప్రేరణ ఏమిటి?

కవితలను చదవడం పట్ల చిన్నప్పటి నుండే నాకు ఆసక్తి ఏర్పడింది. దీనికి కారణం మా మేనమామ బ ందావన్‌పట్నాయిక్‌ అనే చెప్పాలి. నా హైస్కూల్‌ చదువంతా మేనమామ గారి సంరక్షణలోనే సాగింది. అప్పట్లో ఏదో దిన పత్రికలో 'కొత్త పాళీలు'  అనే శీర్షిక పేరుతో ప్రతిరోజూ రెండో మూడో కవితలు ప్రచురించేవారు. మా మేనమామకు సాహిత్యంలో ప్రవేశం వుండేది. ఆయన ఆదేశం మేరకు మాకు ఇష్టం వున్నా లేకపోయినా మేము వాటిని విధిగా చదివి ఒక నోటుపుస్తకంలో రాయాల్సి వచ్చేది. ఈ కాలక్రమంలోనే దష్టి కవితలు చదవడం నుంచి రాయాలనే కోరిక కలిగేవరకూ వెళ్ళింది. అందరిలాగే యవ్వనారంభపు రోజుల్లో కళాశాల కన్నెగాలిహోరుతో గుండెలోంచి దూకిన కవిత్వం  పుస్తకాల్లో  దాక్కోవడం మొదలయింది

 •  పార్వతీ పురం నుండి అనేకమంది సాహితీ స జన చేస్తున్న వారు ఉన్నారు కదా! వాళ్ల సాంగత్యం మీ స జనకు  ఎలా దోహదం చేస్తోంది?

- సాహిత్యంలో పార్వతీపురానికి గొప్ప విశిష్టత వుంది. అన్ని సాహితీ ప్రక్రియలలోనూ రాష్ట్రస్థాయిలో ప్రసిధ్ధులయిన వారుండడం ఈ నేల గొప్పతనం. ప్రస్తుత కాలంలో ఇక్కడ ప్రముఖ సాహితీవేత్త గంటేడ గౌరునాయుడు నాలాంటి ఎంతోమంది సజనశీలురను వెతికి పట్టుకుని మరీ ప్రోత్సాహిస్తున్నారు. అతని మార్గనిర్దేశంలోనే మెరికల్లా తయారయిన నా మిత్రులు మల్లిపురం జగదీష్‌, చింతా అప్పలనాయుడు, సిరికి స్వామినాయుడులతో పాటు ఔత్సాహిక కవులు, కథకులూ అయిన  పల్ల రోహిణీకుమార్‌, చందనపల్లి గోపాలరావు, హరిచందన్‌, తిమ్మక రాంప్రసాద్‌ లాంటివారు ఎందరో వున్నారు. వీరేకాక సాహిత్య ప్రముఖులయిన కె క్యూబ్‌ వర్మ, పాలకొల్లు రామలింగ స్వామి కూడా స్థానికంగానే వున్నారు. ఇక బాలసాహిత్యానికి సంబంధించి నాలుగు దశాబ్దాలుగా రచనలు చేస్తున్న లబ్ద ప్రతిష్ఠులైన నారంశెట్టిఉమామహేశ్వరరావు, బెహరా ఉమామహేశ్వరరావు బెలగాం భీమేశ్వరరావు, బి.వి.పట్నాయక్‌ వంటివారు కూడా పార్వతీపురానికి చెందినవారే

 • ఎప్పుడో కవిత్వం రాయడం మొదలు పెట్టిన  రవీంద్రనాథ్‌ ఇప్పటికీ పుస్తకం తీసుకు రాలేక పోవడానికి కారణమేంటి?

- దీనికి ప్రధాన కారణం నన్ను నేను ఒక సీరియస్‌ కవిగా గుర్తించలేకపోవడమే. 1985, 1987 నుండి 90 మధ్యలో రాసిన కవితలు ప్రముఖ పత్రికలలో ప్రచురించబడుతుండేవి. అయితే నేను రాస్తున్న కవిత్వం ప్రామాణికత, నాణ్యతల విషయంలో నాకు అంతగా సంతప్తిగా అనిపించేది కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే వచన కవిత అన్నిస్థాయిల పాఠకుణ్ణి చేరుకోలేకపోవడం నాకు బాగా అసంత ప్తిని కలిగించేది. వీటన్నిటికీ సంత ప్తికరమైన సమాధానాలు నాకు గౌరునాయుడు గారి ద్వారా లభించాయి. ప్రస్తుతం పుస్తకాన్ని  తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది

 •  మీ కవితా ప్రస్థానం లో రెండు సార్లు సుదీర్ఘ విరామాలు రావడానికి కారణమైన అవరోధాలేంటి...సున్నిత మనస్కుడైన మీరు వాటినెలా దాటి వచ్చారు?

 - పైన చెప్పిన జవాబే దీనికీ వర్తిస్తుంది. అయితే నాకు సంబంధించినంతవరకు నిజాయితీగా చెప్పాలంటే నేను కవిత్వంలో వెలిబుచ్చిన అభిప్రాయాలను నేనెంతవరకు ఆచరిస్తున్నానన్న ప్రశ్న అడుగడుగునా అడ్డం పడేది. అదే చాలా సందర్భాలలో నన్ను రాయనీకుండా కూడా చేసింది. అయితే కవిత్వం మీద వున్న ప్రేమ మీలాంటి సాహితీమిత్రుల సాంగత్యం ఈ అవరోధాలను దాటిస్తూ మళ్ళీ కవిత్వపుదారి పట్టిస్తోంది .

 •  ఉత్తరాంధ్ర లో మీకు నచ్చిన కవి,తెలుగులో ఇష్టమైన కవి,ఇతర భాషల్లో మీరు అమితంగా ప్రేమించే కవి ఈ వివరాలేవైనా చెప్పగలరా

 - ఉత్తరాంధ్రకు సంబంధించినంతవరకు గంటేడ గౌరునాయుడు, కె.క్యూబ్‌ వర్మ గార్ల కవిత్వాన్ని నేను బాగా ఇష్టపడతాను. ఇతర భాషల కవులను ఎవర్నీ నేనింతవరకూ చదువుకోలేదు.

 •  మీరు కవిత్వం మొదలు పెట్టిన రోజులకీ ఇప్పటి రోజులకీ కవిత్వ నిర్మాణం లో ఎలాంటి మార్పులు గమనించి ఉంటారు

- నేను కవిత్వం రాయడం మొదలుపెట్టింది 35 ఏళ్ల క్రితం. అప్పటి కవిత్వానికీ ఇప్పటి కవిత్వానికీ నిర్మాణం, శిల్పంలో బాగా తేడా వచ్చింది.  ఇప్పుడు రాస్తున్నవారిలో ఒకపక్క రోజుకో కవిత రాసి పడేయాలనే ధోరణిలో రాస్తుంటే మరోపక్క తక్కువగా రాసినా కవిత్వమంటే మన అనుభవాలకు అక్షరాల రెక్కలు తొడిగి పాఠకుల హదయాలలో విహరింపజేయడమే ధ్యేయంగా సిన్సియర్‌గా కవిత్వాన్ని రాస్తున్న వారున్నారు. వీరిలో అనిల్‌ డ్యానీ, పాయల మురళీకష్ణ, అరుణ్‌ బవేరా, పుప్పాల శ్రీరాం, చింతా అప్పలనాయుడు, మొయిద శ్రీనివాసరావులాంటి వారున్నారు

 •  కవిత్వంలో ఇప్పటి వారితో పోటీ పడటం మీకెలా అనిపిస్తోంది. కవిత్వంలో పోటీ అనే మాటకు తావు లేదు. కవిత్వం ఒక హ దయం నుండి మరో హ దయానికి జరిగే నిశ్శబ్ద సంగీత ప్రసారం. ఏకాంత యానకంలోంచి అక్షరాలను ఆవహించే ఈ క్రమంలో నాకయితే - ఇంతవరకూ కవిత రాస్తున్నానన్న స్ప హకూడా లేని స్థితికి చేరగలిగితే ఎంత బాగుణ్ణనిపిస్తుంది. అలాంటప్పుడు ఇంకొక కవి ఎలా గుర్తొస్తాడు. అతనితో మనం పోటీ పడాలన్న ఆలోచనకు చోటెక్కడుంది.
 •  కవిత్వంలో మార్క్సిస్ట్‌ దక్పథం గురించి మీ అభిప్రాయం ఏమిటి?

- ఆకలిరాజ్యం సిన్మా చూశాకగానీ నేను మహా ప్రస్థానాన్ని చదవలేదు. అది చదివాక మాత్రం కవిత్వమంటే సామాజిక ప్రయోజనంకోసమే రాయాలి అనే నిశ్చయానికొచ్చేలా చేసింది. మార్క్సిజం చదివాక సమాజంలో జరుగుతున్న వర్గ దోపిడీ స్పష్టంగా అర్ధమైంది. అనివార్యంగా మన అక్షరాన్ని శ్రామిక వర్గపు పక్షాన నిలబెట్టాలన్న స్ప హ మార్క్సిజం కలిగించింది.

 •  దళిత వాదం ,స్త్రీ వాదం,మైనారిటీ వాదం లాంటి అస్తిత్వ వాదాలపై మీ అభిప్రాయమేమిటి?

- ఎవరి వేదనను వారు వ్యక్తం చేసుకునేటప్పుడు ఆ కవిత్వం సూటిగా పాఠకుడి హదయాన్ని తాకుతుంది.  అయితే ఇప్పుడు వస్తున్న వివిధ వాదాల కవిత్వాలను నిశితంగా పరిశీలిస్తే ఇందులో చాలా మంది వర్గ స్పహ లేకుండా రాయడం వల్ల వారి కవిత్వాన్ని ఆయుధం చేయడంలో సఫలమైనా గురితప్పి దోపిడీ శక్తులను పట్టి చూపించడంలో విఫలమవుతున్నాయనిపిస్తోంది. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం

 •  ముందు ముందు కవిత్వం లో మీ ప్రయాణం ఎలా ఉండబోతోంది?

- కవిత్వానికి పూర్తికాలపు సజనకారునిగా నా ప్రయాణం మొదలుపెడతాను. ఈ అవార్డును నాకు ప్రకటించిన ఎక్స్‌ రే సంస్థకు, దీనికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన పెద్దలు నందిని సిధారెడ్డిగారికి , ఈ ఇంటర్వ్యూ ద్వారా నా భావాలను సాహితీ మిత్రులతో పంచుకునే అవకాశం కల్పించిన  మీకు ధన్యవాదాలు.