'శ్వేత గులాబితోట' ఆవిష్కరణ

నెల్లూరు జిల్లా సాహితీస్రవంతి ఆధ్వర్యంలో  నెల్లూరు పట్టణంలోని వర్థమాన సమాజమందిరంలో డిసెంబర్‌ 10న డా|| ఈదూరి సుధాకర్‌ రాసిన 'శ్వేత గులాబీతోట' కవితా సంపుటి ఆవిష్కరణ సభ జరిగింది. ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాధ్‌ ఆవిష్కరించారు. చెలంచెర్ల భాస్కర్‌ రెడ్డి అధ్యక్షత వహించిన ఈ సభలో యండమూరి మాట్లాడుతూ సామాజిక చైతన్యాన్ని చాటి చెపుతున్న ఈదూరి సుధాకర్‌ కవిత్వంలో ఆవేశం, ఆవేదన నిండి ఉన్నాయనీ, ముప్పై సంవత్సరాలుగా కవిత్వ సృజన చేస్తున్న డా|| ఈదూరు సుధాకర్‌ ఆలస్యంగా తన కవితా సంకలనం వెలువరించినా మంచి కవితలను పాఠకులకు అందించారన్నారు. టి.వి. సీరియళ్ళ ప్రభావంతో ప్రస్తుతం సాహిత్యానికి పాఠకులు కరువయ్యారని, అయినప్పటికీ మంచి పుస్తకానికి ఆదరణ లభిస్తూనే ఉన్నదని ఆయన తెలిపారు. నవలా సాహిత్యంలో గోపిచంద్‌, కొడవటిగంటి చేసిన రచనలు సరికొత్త విలువలను సమాజానికి నేర్పించాయని, ఆడపిల్లలను నవలా పఠనంవైపు మళ్ళించిన ఘనత యద్ధనపూడి సులోచనారాణి గారికే దక్కుతుందని అన్నారు. పుస్తక రచయిత డా|| ఈదూరి సుధాకర్‌ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్లనే పుస్తకం వెలువరించడం ఆలస్యమైందని, నెల్లూరు జిల్లా జైలులో ఉన్న ఖైదీలకు వైద్యసేవలు అందించిన కాలంలో వారితో సన్నిహితంగా మెలుగుతూ వారి నుంచి గ్రహించిన అంశాలను కవితా వస్తువుగా చేసుకుని 'శ్వేత గులాబితోట' సంపుటి వెలువరిస్తున్నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాహితీస్రవంతి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పి. గోపినాథ్‌, కార్యదర్శి ఈతకోట సుబ్బారావు, నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాతూరి అన్నపూర్ణ, బాలభవన్‌ డైరెక్టర్‌ గోవిందరాజు సుభద్రాదేవి, పెన్నా రచయితల సంఘం కార్యదర్శి అవ్వారు శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.