'మట్టిపోగు' కవితా సంపుటి ఆవిష్కరణ

అనంతపురం సాహితీస్రవంతి ఆధ్వర్యంలో అనంతపురంలో డిసెంబర్‌ 2న పిళ్ళే కుమారస్వామి కవితా సంపుటి 'మట్టిపోగు' ఆవిష్కరణసభ జరిగింది. ఈ సభకు తారళ జోత్న్స అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడుతూ జీవితపు పోగులను కలిపి 'మట్టిపోగు'గా పిళ్లాకుమారస్వామి ఆవిష్కరించారన్నారు. ఆత్మీయ అతిథిగా హాజరైన రాధా స్కూలు అధినేత జయచంద్ర మాట్లాడుతూ మట్టికి మట్టిమనిషికి మధ్య ఒక వంతెనలాగా ఈ మట్టిపోగు నిలుస్తుందన్నారు. పుస్తక సమీక్షకులుగా హాజరైన ప్రముఖకవి మల్లెల నరసింహామూర్తి మాట్లాడుతూ పిళ్లాకుమారస్వామి స్త్రీలపక్షాన, దళితుల పక్షాన, రైతుల పక్షాన నిలబడిన కవనీ అన్నారు.  రైతులతో దేశపటంపై ఆకుపచ్చ సంతకం చేయించాలనడం వంటి మంచి కవితా వాక్యాలు ఈ సంపుటిలో ఉన్నాయన్నారు. పుస్తకం మనిషిలో జ్ఞాన దీపం వెలిగిస్తుందన్నారు. ముఖ్యఅతిథి కేంద్రసాహిత్య అకాడమీ కౌన్సిల్‌ సభ్యులు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ సాహిత్యం సామాజిక పరివర్తనకు సాధనమన్నారు. రచయితకు నిర్థిష్ట భావజాలం వుందన్నారు.  పిళ్లాకుమారస్వామి సమానదృష్టి ఉండటంవల్ల, మార్క్సిస్టు సాహిత్యం పట్ల అవగాహన ఉండటం వల్ల మట్టిపోగు కావ్యంలో దళితులు, స్త్రీలు, రైతులు, కార్మికులు అందరూ చోటుచేసుకున్నారన్నారు. మట్టిని విస్మరించిన నేలపైనే ఉండి ప్రజాజీవితాన్ని ఆవిష్కరంచడం అవసరమన్నారు. రచయిత పిళ్లా కుమారస్వామి మాట్లాడుతూ అనేక సామాజిక

ఉద్యమాల ప్రభావంతో తాను కవిత్వం రాశానన్నారు. ఈ కవిత్వం ప్రజలకే చెందుతుందన్నారు. సాహిత్యం సమాజాన్ని చైతన్యం చేస్తుందని తెలిసిన తరువాత కవిత్వాన్ని సామాజిక సందర్భాల కనుగుణంగా వ్యక్తీకరించానన్నారు. రైతులు డిóల్లీ పురవీధులలో పోరాటంచేస్తున్న సందర్భంలో 'మట్టిపోగు' ఆవిష్కరించరించడం తనకు సంతోషంగా ఉందన్నారు. ఈ సభను సాహితీస్రవంతి అనంతపురం ప్రధానకార్యదర్శి దాముగుట్ల హిమాయతుల్లా సమన్వయం చేసినారు. నిర్మలారాణి, గోవిందరాజచారి, శాంతినారాయణ, సత్యానిర్ధారణ్‌, బాలికొరడ ఆంజనేయలు, నాగేశ్వరాచారి, ఎ.ఎ.నాగేంద్ర, సూర్యనారాయణ రెడ్డి, రియాజుద్దీన్‌, క్రిష్ణవేణి, హరినాధరెడ్డి, వెంకటరత్నం, లక్ష్మీగౌరమ్మఈశ్వరీ తదితరులు పాల్గొన్నారు.