రాజ్యం

- గిరిప్రసాద్‌ చెలమల్లు   9493388201

అక్షరాలు

సిగ్గుపడంగ

విలువల

క్షవరం

రాలే కన్నీటిబొట్ల సాక్ష్యంగా

 

లుకలుకలు

రాజ్యం పోకడలో

క్షమ కానరాక 

అరణ్యరోదనల వెల్లువ

ఆగమాగం

వనరుల అన్యాక్రాంతం

సగటు మనిషికి

దక్కని ఫలం

ఎదుర్కొంటే

బొక్కలిరగొట్టి

ద్రోహి బిరుదు

ఆకలి

రుచెరుగక

తునకలు దండెంపై నుండి

కడాయిలో పడంగానే

సుయ్యిమంటే

భక్తుల వీరంగం

ఒళ్ళు పొట్టుపొట్టు

కుళ్ళబొడిచే

 

మనసొమ్ము

పరాయి బ్యాంకులల్ల

కనీసనిల్వ

లేని ఖాతాలల్ల రుసుం

ఎగవేత బొక్కసం పూడ్చే

అర్థశాస్త్ర నీతి

నల్లధనం

తెల్లగా హద్దులుదాటొచ్చే

వడ్డించేటోడు మనోడైతే

యాడున్నా చియ్య కంచంల

లఘుకోణం గురుకోణం లంబకోణం

ఎరుక

కుంభకోణం  విమానాల ప్రక్షేపక

శాస్త్రాన్వేషణలో

కొసమెరుపు

దైవం మూలం

మనిషి భయం

సొమ్ముచేసుకునే హక్కుదారులకి ఊతం

చట్టం చుట్టం

అరాచకం ఆధ్యాత్మికత ముసుగు

తేటతెల్లం

అడ్డమో నిలువో

బొట్లు

శీలమో మానమో పేరేదైనా దోపిడి స్థూలంగా

మనదే

మనకోసమే

మనచే  పరిఢవిల్లే ప్రజాస్వామ్యం

వాడిదే వాడికోసమే వాడిచే

కనుసైగల్లో

రాజ్యం నడక

నడత తప్పి

వికటాట్టహాసం