అనంతపురంలో తరుణీ తరంగాలు

అనంతపురం జిల్లా సాహితీస్రవంతి, ఎ.ఎమ్‌.ఎన్‌. మహిళా కళాశాల భాషా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో మార్చి 24న ఆరుగురు మహిళా రచయిత్రుల పుస్తకాలపై సమీక్షా సదస్సు జరిగింది. వర్తమాన సాహితీ తరంగాలు పేరున జరిగిన ఈ కార్యక్రమానికి వై. విజయ బృంద, కటకం కృష్ణవేణి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన డా|| దేవకి మహిళా దినోత్సవ సందర్భంగా ఇలాంటి సదస్సు నిర్వహించడం సంతోషకరమన్నారు. జిల్లాలో ప్రజల స్థితిగతులను, సమస్యలను, మానవ సంబంధాలను కథల్లోకి, కవిత్వంలోకి తీసుకురావాలన్నారు. చేలూరి రమాదేవి రాసిన 'స్వేచ్ఛాగానం' నవలను ప్రముఖ రచయిత్రి శశికళ, నిర్మలారాణి రాసిన 'గాజుకళ్ళు' సంపుటిని ప్రముఖ విమర్శకులు అరుణ, జయలక్ష్మీరాజు రాసిన 'అమ్మానాన్న, సుశీల' కథల సంపుటిపై ప్రముఖ విమర్శకురాలు తరళ జ్యోత్స్న సమీక్షించారు. డా|| దేవకి రాసిన 'మాటల ఒడిలో' కథల సంపుటిని సాహితీ విమర్శకులు హేమమాలిని సమీక్షించారు.  'శేషప్రశ్న' రచయిత షహనాజ్‌,  'మా తుజే సలాం' రచయిత్రి శశికళ తమ కథలను వివరించారు. సాహితీస్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి హిదయ్‌తుల్లా, సాహితీస్రవంతి జిల్లా గౌరవాధ్యక్షులు పిల్లా కుమారస్వామి, సాహితీస్రవంతి నగర కార్యదర్శి దాదా ఖలందర్‌, నగర గౌరవాధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి, కవులు జూటూరి షరీఫ్‌, రియాజుద్దీన్‌, ప్రసన్న రావల, కొత్తపల్లి సురేష్‌, కుంచె లక్ష్మీనారాయణ, అశ్వర్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు.