గుంటూరులో జాషువా జయంత్యుత్సవాలు

గుంటూరులో సెప్టెంబర్‌ 22 నుండి 28 వరకు జాషువాసాంస్క ృతిక పీఠం ఆధ్వర్యంలో వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో జరిగిన జాషువా జయంత్యుత్సవాల్లో భాగంగా సెప్టెంబర్‌ 27న జరిగిన దళిత లిటరరీ ఫెస్టివల్‌ కార్యక్రమం. చిత్రంలో సతీష్‌చందర్‌, పసునూరి రవీందర్‌, పాపినేని శివశంకర్‌, ఎండ్లూరి సుధాకర్‌, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, కొలకలూరి ఇనాక్‌ తదితరులు.కుల జాడ్యం సమాజాన్ని పట్టి పీడిస్తుందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. గుర్రం జాషువా 122వ జయంత్యుత్సవాల్లో భాగంగా సెప్టెంబర్‌ 27న గుంటూరులో వెంకటేశ్వరా విజ్ఞాన మందిరంలో దళిత్‌ లిటరిసీ ఫెస్టివల్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా సుమారు 40 మంది కవులు, రచయితలు హాజరయ్యారు. తొలుత కన్నావారితోటలో జాషువా విగ్రహానికి ఆచార్య కొలకలూరి ఇనాక్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి విజ్ఞాన మందిరానికి ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ను భారీ ఊరేగింపు మధ్య తీసుకొచ్చారు. అనంతరం దళిత్‌ లిటరసీ ఫెస్ట్‌కు ఇనాక్‌ అధ్యక్షత వహించారు. డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మాట్లాడుతూ కులసమాజం కూలిన నాడు భారతీయ సమాజం ప్రపంచంలో గర్వంగా ఎదుగుతుందన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శరణ్‌కుమార్‌ సిబాల్‌ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అనేక రూపాల్లో వివక్షత ఉన్నప్పటికీ దేశంలో లింగవివక్ష, అస్పశ్యత, వెలివేత బతుకులు ఉన్నాయన్నారు. ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ మాట్లాడుతూ జాషువా సాహిత్యం ఒక్క రోజులో ఆవిష్కరించింది కాదని, తరతరాల వేదనకు వ్యతిరేకంగా ఆయన సమరశంఖం పూరించాడన్నారు. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్‌ మాట్లాడుతూ తన సాహిత్యంపై జాషువా ప్రభావం అధికంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జాషువా పురస్కారాలను ఎండ్లూరి సుధాకర్‌, పాపినేని శివశంకర్‌కు అందచేశారు. పలు రాష్ట్రాల రచయితలు మతివన్నన్‌, శశికుమార్‌, ఎస్‌.చంద్రమోహన్‌, రమేష్‌, గోగు శ్యామల, డాక్టర్‌ పసునూరి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.