జి.వో.నెం. 14ను రద్దు చేయాలని కోరుతూ విజయవాడలో ఒకరోజు సత్యాగ్రహం

మున్సిపల్‌ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ జారీచేసిన జి.ఒ.నెం.14/2-1-2017 వ్యతిరేకిస్తూ  ఫిబ్రవరి 19న విజయవాడలో అలంకార హోటల్‌ వద్దగల ధర్నాచౌక్‌లో మాతృభాషా మాధ్యమ వేదిక ఆధ్వర్యంలో  ఒకరోజు సత్యాగ్రహ కార్యక్రమం జరిగింది. రచయితలు, పత్రికా సంపాదకులు, ప్రచురణకర్తలు, ఉపాధ్యాయులు, కళాకారులు, తెలుగు భాషాభిమానులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాతృభాషా మాధ్యమిక వేదిక స్థాపకులు శాసనమండలి సభ్యులు వి. బాలసుబ్రహ్మణ్యం, విద్యావేత్త పరిమి, తెలుగు భాషోద్యమ నాయకులు సామల రమేష్‌బాబు, విద్యావికాస వేదిక ప్రతినిధి రమేష్‌ పట్నాయక్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూననివర్శిటీ ఆచార్యులు గారపాటిఉమామహేశ్వరరావులతో పాటు నాగార్జున విశ్వవిద్యాలయం ఆచార్యులు ఎన్‌. అంజయ్య, శాసన మండలి సభ్యులు ఎం.వి.ఎస్‌. శర్మ, ప్రజాశక్తి బుక్‌హౌస్‌ సంపాదకురాలు కె. ఉషారాణి, కథా రచయిత సడ్లపల్లి చిదంబరరెడ్డి తదితరులు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. సుమారు మూడు వందలకు పైగా నిరసన శిభిరంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ విద్యార్థులు, నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థులు కూడా సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. సత్యాగ్రహ శిభిరాన్ని సందర్శించి దీక్షకు మద్దతు తెలిపిన వారిలో   ప్రముఖ కవి ఖాదర్‌ మొహియుద్దీన్‌, కొత్తపల్లి రవిబాబు,డా|| గుమ్మా సాంబశివరావు, డా|| రావెళ్ళ, వొరప్రసాద్‌, దివికుమార్‌, చీకటి దివాకర్‌, దాసరి రామకృష్ణరాజు, శాసన మండలి సభ్యులు బొడ్డు నాగేశ్వరరావు, ఆచార్య గంగప్ప, బి. హనుమారెడ్డి తదితరులు ఉన్నారు. ప్రజానాట్యమండలి కళాకారులు తెలుగు భాషపై పాడిన గేయాలు శిభిరంలో ఉత్తేజం నింపాయి. శిభిరంలో ప్రసంగించిన వారు ప్రభుత్వం తీసుకొచ్చిన జి.వో.ను పూర్తిగా రద్దుచేయాలని, భాషా విధానాన్ని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.