విజయవాడలో ప్రగతిశీల ఉగాది ఉత్సవం

 సమాజంలో నైతిక విలువలు లోపిస్తున్నాయని ప్రజాశక్తి సిజిఎం, మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. అశాస్త్రీయ పంచాంగాలు, జాతకాలు, మూఢ నమ్మకాలను ప్రశ్నిస్తూ 17 అభ్యుదయ, ప్రగతిశీల సంఘాల ఆధ్వర్యంలో ఉగాదిరోజు ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఉగాదిఉత్సవంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేమన పద్యాలను నృత్య రూపకంగా ప్రదర్శించారు. ప్రజా నాట్యమండలి, అరుణో దయ కళాకారులు తమ కళారూపాల ద్వారా మూఢ నమ్మకాలను, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారు. అనంతరం జరిగిన సభలో శర్మ మాట్లాడుతూ అంతరించిపోతున్న తెలుగు భాషా సంస్క ృతిని కాపాడవలసిన బాధ్యత నేటి యువత పై ఉందన్నారు. నాస్తిక కేంద్రం సంచాలకులు జి విజయం మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు, వ్యవసాయ రంగ సంక్షోభాల వల్ల ప్రజలు పండుగలనే మర్చిపోయారన్నారు. ప్రకృతి విధ్వంసమవుతోందని, గ్లోబల్‌ వార్మింగ్‌ భూతంలా వెంటాడుతోందని భౌతిక శాస్త్ర అధ్యాపకులు డాక్టర్‌ తుమ్మల శ్రీకుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ ప్రకృతి సంపదైన వేప, పసుపు వంటి ఉత్పత్తులపై సామ్రాజ్యవాద దేశాలు పేటెంట్‌ పేరుతో పెత్తనం చెలాయిస్తున్నాయని విమర్శించారు. రావెళ్ళ శ్రీనివాస రావు, యామిని కోడె, కోపూరి పుష్పాదేవి, కె.ఎక్స్‌. రాజు, శాంతిశ్రీ, కట్టా సిద్ధార్థ, బ్రౌన్‌, తదితరులు స్వీయ కవితలు వినిపించారు. నాస్తిక సమాజం కార్యదర్శి మోతుకూరి అరుణకుమార్‌, హేతువాద సంఘం అధ్యక్షులు నార్నె వెంకటసుబ్బయ్య,  కూరపాటి రామారావు ( ఐఎఫ్‌టియు ), కెఎస్‌సి బోస్‌ ( ఎంబి విజ్ఞాన కేంద్రం ), కొత్తపల్లి రవిబాబు ( ప్రజాసాహితి ), సింగంపల్లి అశోక్‌ కుమార్‌ ( శ్రీశ్రీ సాహిత్య నిధి ), శాంతిశ్రీ ( ప్రజాశక్తి ), బి జమిందార్‌ ( (ప్రోగ్రసివ్‌ ఫోరమ్‌ ) తదితరులు ప్రసంగించారు.