ఉత్తేజం నింపిన భీమవరం జనకవనం

వర్తమాన సామాజిక చిత్రాన్ని భీమవరం జనకవనం కళ్ళకు కట్టింది. సమకాలీన జీవిత సమస్యలను వైవిధ్యభరితంగా తమ కవితల్లో గానం చేశారు కవులు. నేటి వ్యవస్థలో అమలుచేయబడుతున్న సామాజిక, ఆర్థిక విధానాల కారణంగా నలిగిపోతున్న ప్రజల గొంతును పట్టించింది భీమవరం జనకవనం. సిపిఎం 25వ మహాసభలను పురస్కరించుకుని భీమవరంలోని క్లాత్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ హాలులో ఫిబ్రవరి 4న జరిగిన జనకవనం ఆద్యంతం ఉత్తేజభరితంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 10 జిల్లాల నుండి హాజరై కవులు తమ స్వీయ కవితలను వినిపించారు. తెలుగునాట ప్రసిద్ధులైన రచయితల నుండి ఔత్సాహిక రచయితల వరకు ఈ జనకవనానికి హాజరై కవితా గానాన్ని ఆస్వాదించారు.ఆధునిక అభివృద్ధి ఫలాలు సామాన్య ప్రజల వరకూ చేరకుండా అడ్డుపడుతున్న పెట్టుబడిదారీ విధానాల నిజస్వరూపాన్ని కవులు తమ కవితల్లో చిత్రించారు. ఒకవైపు అత్యంత సాంకేతిక అభివృద్ధి కనపడుతున్నా అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో దుర్భర దారిద్య్రాన్ని సృష్టిస్తున్న వైనాన్ని ప్రశ్నించారు. ఒకపక్క సంపద కేంద్రీకరణ మరోవైపు నిత్యావసరాలు తీర్చలేని పరిస్థితులను తమ కవితల్లో శక్తివంతంగా చాటారు. దేశంలో దీర్ఘకాలంగా అమలుచేయబడుతున్న ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా క్షీణిస్తున్న మానవ విలువల పట్ల వేదన చెందడం కవితల్లో కనిపిస్తుంది.రోజంతా జరిగిన జనకవనంలో తొలిభాగంలో ప్రారంభ సభ జరిగింది. సాహితీస్రవంతి గౌరవ అధ్యక్షులు, ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు తెలకపల్లి రవి జనకవనం ప్రారంభోపన్యాసం చేశారు. ప్రజాకళల ద్వారా ఉద్యమాలకు ఊపిరిపోసిన చరిత్ర కవులకు ఉందని, మతతత్వం, మార్కెట్‌శక్తులు బుసకొడుతున్న తరుణంలో కవులు, రచయితలు, కళాకారులపై బృహత్తర బాధ్యతఉందని ఆయన అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనమండలి సభ్యులు వి. బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కవిత్వం వ్యక్తిగతం కాదని సామాజికపరం అంటూ ప్రజా కవిత్వం విస్తృతంగా రావలసిన అవసరం ఉందన్నారు. సిపిఎం పార్టీ రాష్ట్రకమిటీ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ సాహిత్య, సాంస్క ృతిక రంగాలలో ప్రగతిశీల భావజాల వ్యాప్తి జరగాలని, మూఢత్వాన్ని, అంధ విశ్వాసాలను తిరిగి ప్రతిష్టించడానికి మతోన్మాద శక్తులు పనిచేస్తున్నాయని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని కవులకు విజ్ఞప్తిచేశారు. ఆంధ్రప్రదేశ్‌ పండితపరిషత్‌ రాష్ట్ర అధ్యక్షులు గిరిరాజ్‌ మాట్లాడుతూ జనకవనం వంటివి తెలుగు భాషా ఉన్నతికి తోడ్పడతాయని అన్నారు. ప్రారంభ సభకు అధ్యక్షత వహించిన సాహితీస్రవంతి రాష్ట్ర అధ్యక్షులు వొరప్రసాద్‌ మాట్లాడుతూ సామాజిక చైతన్యాన్ని పెంచే దిశగా రచనలు చేయడానికి జనకవనాలు స్ఫూర్తినిస్తాయని, ప్రజా కవుల్లో ఉత్తేజం నింపడానికి ఇటువంటి కార్యక్రమాలు తోడ్పడతాయని అన్నారు.అనంతరం మూడు భాగాలుగా సాయంత్రం వరకూ జనకవనం జరిగింది. తొలిభాగంలో ప్రముఖ కవులు శిఖామణి, ప్రసాదమూర్తి, దాట్ల దేవదానం రాజు ఆత్మీయ సందేశాలను ఇచ్చారు. శాంతిశ్రీ, నూనెల శ్రీనివాసరావు, నాగాస్త్ర్‌, మార్ని జానకిరాంలు జనకవనాన్ని నిర్వహించారు. భోజనానంతరం జరిగిన విభాగంలో ఎస్‌.ఆర్‌. ఫృధ్వీ, అద్దేపల్లి ప్రభు, గనారా, బొల్లోజు బాబా, సత్యాజీ, రెడ్డప్ప ధవేజిలు ఆత్మీయ సందేశాలు ఇచ్చారు. చింతాడ రామారావు, చైతన్య ప్రసాద్‌, చంద్రికారాణిలు జనకవనం నిర్వహించారు. చివరి విభాగంలో ప్రధాన ఆదినారాయణ, వి. శ్రీరామమూర్తి, సయ్యద్‌ సలార్‌, ర్యాలి శ్రీనివాసరావు, కడిమెళ్ళ వరప్రసాద్‌లు ఆత్మీయ ప్రసంగాలు చేశారు. ఎ.వి. రమణారావు, డి.ఆర్‌.కె. నాయుడు జనకవనం నిర్వహించారు.ఈ జనకవనంలో చదివిన కవితలతో కవితా సంకలనం వెలువరిస్తున్నట్లు మహాసభల ఆహ్వానసంఘం తరపున మంతెన సీతారాం సభలో ప్రకటించారు. కవులు కవితా పఠనం అనంతరం నిర్వాహకులకు తమ కవితలను అందజేశారు. వాటిలో నుండి కొన్ని కవితా చరణాలు....కాలంలో గురితప్పిన మనిషి  / తనను తాను పోగొట్టుకున్న ఏకాకితనం / జన సముద్రం మధ్య ద్వీపం లాంటి ఒంటరి ప్రాణం/ జీవితపు ఖాళీల్లోకి చొరబడుతున్న నిశ్శబ్ద సునామీ/ ఎలియనేషన్‌ ఆధునిక అర్థశాస్త్ర ఆవిష్కరణ- డా|| చల్లా రవికుమార్‌ఇది ఉసురు తీస్తున్న శిశిరం/ వసంతాన్ని మేల్కొలిపే ఉద్యమానికి ఇది సమయం/ రాలిపడుతున్న కలలన్నీ తిరిగి చిగిర్చి / పచ్చని పిడికిళ్ళెత్తిన పూలు పూయాలి   - పి. గోపినాథ్‌'అవసరాలను విలాసాలు కూనీ చేసినప్పుడల్లా /ఫ్యాక్టరీలు శిలాఫలకాలపై/ పిట్టల్లా వాలైనా ఎర్రపక్షులు ప్రతిఘటిస్తాయి.'                   - సిద్ధార్థ కట్టా    నీది పశువుల రాజ్యం /మనుషులకు స్థానం లేదక్కడ / మానవత్వం కాదు నీది /మనువత్వం       - బ్రౌన్‌జీవితం ఎలా ఉంది అని అడుగుతానా / కళ్ళు రెండూ సముద్రాలే అవుతాయి. / దేహం మొత్తం ఒణికి పోతూ / గుండె లోంచి ఏవో మెరుపుల శబ్దం / ఏదో దహనపు వాసన... / చిన్నాభిన్నమయి పోయిన కలలు / నిరవధికంగా కురుస్తూనే ఉంటాయి                            - శిఖా ఆకాష్‌కొడిగట్టిన దీపంలా రక్తసంబంధాలు/ మనిషి జీవితంలో ఇదో విషాదఘట్టం              - రాజాబాబు కంచర్లఅక్షరమే కదాని తొక్కిపారేయకు/ మంత్రించి వదిలిన గడ్డిపరకలా / బ్రహ్మాస్త్రమై దహిస్తుంది / నిప్పుల కొలిమిలో కాలుతున్న పేగుకణం / నెత్తుటి స్వప్నాన్ని శ్వాసిస్తుంది- మార్ని జానకిరామ్‌ చౌదరిశ్రమలో స్వేదం ఎంత సత్యమో / పోరుబాటలో విజయం అంతే నిజం/ భూమికి మనిషికీ బంధాన్ని ఏమార్చుతూ / మట్టిగా మార్చేవారిపై అదే పోరుమార్గం     - శాంతిశ్రీమనిషిని అణచి అణచి అణగదొక్కితే / అణగి మణిగిన గుప్త శక్తే / కట్లు తెంచుకు ఉబికి లేస్తే / నీటిధారే లావా ఏరై / పోరుబాటై పోరుతుంది / మరో స్వాతంత్య్రం ఉదయిస్తుంది / స్వేచ్ఛాగీతం పాడుతుంది  - వి. యోగానందం నాయుడుకాసులు చేసే మాయకూ.. కాలం చేసే మాయకూ.../ కర్షకుడు హలం మీద ఆశలు అడుగంటి ఆత్మహత్యలు చేసుకుంటుంటే / రాబోయే రోజుల్లో రైతంటే ఎవరనే పదానికి అర్థం ఏ నిఘంటువులో వెతకాలో? - యామినీ దేవి కోడేఊరిచివరి చెట్టు, ఆ ప్రక్కనుండే స్మశానం/ రేపు వ్రేలాడే రైతుకోసం బావురుమంటున్నై/ ఇది, నా గణతంత్ర దేశం పుస్తకంపై / నిత్యం దర్శనమిచ్చే.../ నిత్యనూతన ముఖచిత్రం.- కొత్తపల్లి మణిత్రినాథరాజుపోగుపడుతున్న మహా సంపద ముందు / తెగిపడిన బతుకు తల కోసం/ తొక్కిసలాటలో దేవులాడుతున్నాడు / నిర్వాసితుడు.                      - అద్దేపల్లి ప్రభురాష్ట్రం చీలి నాలుగేళ్ళయినా / రాజధాని నిర్మాణానికి నాల్గు రాళ్ళు పడలే!               - గడల శివప్రసాద్‌ఉద్యమకారులు సమాజమనే కర్మాగారాన నిత్యకార్మికులు/ సమాజ సంక్షేమ సాగుబడి క్షేత్రాన నిరంతర కర్షకులు / అవినీతి రుగ్మత సోకిన సమాజ వ్యవస్థలను / నిరసనలు పోరాటాలతో/ స్వస్థత పరచే సామాజిక వైద్యులు.                 - దుప్పాడ రామకృష్ణ నాయుడుఅల్లంత దూరంలో / అలరించిన దృశ్యం/ చరవాణిలో ఇమిడి/ అరచేతిలో ఒదిగిపోయింది/ విజ్ఞాన ప్రగతికి అబ్బురపడేంతలోనే / విశృంఖల విన్యాసాలకు తెరతీసింది / విజ్ఞానం, వినోదం, వికాసాలను క్రమ్మివేసి/ అవధుల్లేని అశ్లీలతను వడ్డిస్తోంది.             - ఎ.వి. రమణారావుఎరుపెక్కిన తూరుపు దిక్కున / నీలి మేఘాల మెరుపుల్నుంచి/ ప్రజ్వరిల్లే చైతన్యం సాక్షిగా/ ప్రతి ఒక్కరూ ఒక్కో అగ్నికణమై/ పెల్లుబుకుతున్నారు ప్రజావెల్లువై!- బెందాళం కృష్ణారావుఅక్షరాన్ని ఆయుధం చేసుకున్నవాడికి అలుపుండదు/ మోసేదేదైనా జన చైతన్యం కోసం/ జనోద్ధరణ కోసం/ ఉదయించే సూర్యుడిలా ప్రకాశాన్ని వెదజల్లడమే తెలుసు వారికి                           - వైష్ణవిశ్రీఅమరావతిలో అంబేద్కర్‌ విగ్రహం/ గరగపర్రులో అంబేద్కర్‌ విగ్రహం/ .../ అది ఓటుబ్యాంకు విగ్రహం/  ఇది ఆత్మగౌరవ విగ్రహం.               - శ్రీ నాగాస్త్ర్‌ఏమౌతుంది? / ఏమౌతుందో తెలియదు  / ఏవో భావోద్వేగాల మంటలు /  దేశం అట్టుడికిపోతోంది /  స్వేచ్ఛా స్వరం విస్తుబోతోంది.            - నూనెల శ్రీనివాసరావుమొత్తం 75 మంది తమ స్వీయ కవితలను ఈ జనకవనంలో చదివారు. ఇవి కొందరి కవితల్లోని కొద్ది చరణాలు మాత్రమే.  ఈ జనకవనం స్ఫూర్తితో కవులు మరిన్ని మంచి కవితలను రాస్తారని ఆశిద్ధాం. ఇంకా ఈ కార్యక్రమంలో కూనపరాజు కుమార్‌, బి.వి.వి. ప్రసాద్‌, రామశాస్త్రి, కలిదిండి వర్మ, రాపాక రాజీవ్‌ తదితరులు పాల్గొన్నారు. మహాసభల ఆహ్వాన సంఘం నిర్వహణలో జనకవనం విజయవంతంగా ముగిసింది.