స్పందన

సాహిత్య ప్రస్థానం తన ప్రస్థానంలో మరో దశలోకి అడుగిడి సరైన దిశగా ప్రయాణిస్తోందనిపిస్తోంది. దీనికి గత మూడు సంచికలే సూచికలు. పుటలు పెరిగి పరిమాణంలోనే కాదు. విలువైన వ్యాసాలతో, ఆలోచింపజేసే కవితలతో ప్రస్థానం సాహిత్య పత్రికలలో తన స్థానం సుస్థిరం చేసుకుంటోంది. సంపాదకులు రవిగారు లేవనెత్తిన 'సాహిత్య రంగంలో సమూహాలు, స్వమోహాలు' చర్చాంశం. టి. సతీష్‌ స్పందనతో ముందుకు నడిచి సాహిత్యరంగంలో రాజకీయాలు, వ్యక్తి పూజలు, భజనలు, మడికట్టుకు రాయడాలు, సాహిత్య క్విడ్‌ప్రోకోలు, కూటములు మొదలైన వాటిని గూర్చి మొహమాటం లేకుండా మన ముందుంచింది. ఈ అంశాలు   ఎప్పటినుండో చాలామంది సాహిత్యాభిమానుల్ని కలవరానికి గురిచేస్తున్నవే అయినా బహిరంగ చర్చకు రాక బహిరంగ రహస్యాలుగానే మిగిలిపోతున్నై. ఈ చర్చ అర్థవంతమైన అవగాహనకు దారి తీసి సాహిత్యకారుల్ని ఆలోచింపజేస్తుందని ఆశిద్దాం.రచయితగా మరణించానని ప్రకటించిన పెరుమాళ్‌ మురుగన్‌ పునరుత్థానం సంతోషించదగ్గ పరిణామం. ఈ విషయాన్ని ప్రకటించిన 'ఇంటర్వ్యూ' మంచి శీర్షిక. ఇలాంటి శీర్షికల వల్ల రచయితల ప్రేరణలు, దృక్పథాలు, వారు ఎదుర్కొన్న ఆటుపోట్లు, వాటిని అధిగమించిన తీరు, వారి జీవన విధానం తెలిసి ఎందరో వర్థమాన రచయితలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. అసహనం, భావస్వేచ్ఛ, కుల దృక్కోణాలపై పెరుమాళ్‌ మురుగన్‌ అధ్యయనం ఫలవంతమై కొత్త ఆలోచనలకు తద్వారా నూతన పోరాట రూపాలకు ఊతమిస్తుందని కోరుకుందాం. ఇలానే నెలకో గొప్ప రచయితను మా ముందుకు తీసుకు వస్తారని ఆశిస్తున్నాం.'ప్రసిద్ధం' శీర్షికను కథానికతో పాటు కవితకు కూడా వర్తింపజేస్తే బాగుంటుంది. సాహిత్య మూలాలను, ఆధారాలను స్పృశించే విమర్శా వ్యాసాలు రావాల్సిన అవసరం వుంది. అంతేకాక సంపాదకీయం సంక్షిప్తంగా కాకుండా మరింత లోతుగా విశ్లేషణాత్మకంగా ఉంటే బాగుండేదనిపించింది.- డా|| కె. శ్రీనివాసులు రెడ్డి, 9493212454