కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు, బాల సుధాకర మౌళి, ఎన్‌. ఉమామహేశ్వర రావు

తెలుగులో ఈ ఏడాదికి 'ఆకు కదలని చోటు' కవితా సంపుటి రచయిత బాల సుధాకర మౌళికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. బాల సాహితీ పురస్కారం 'ఆనందలోకం' పుస్తక రచయిత నారంశెట్టి ఉమామహేశ్వరరావుకు లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు జూన్‌ 22న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది 23 మందిని బాల సాహిత్య, 21 మందిని యువ సాహిత్య పురస్కారాలకు ఎంపిక చేసినట్లు తెలిపారు.  విజయనగరం జిల్లా పార్వతీపురంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా నారంశెట్టి ఉమామహేశ్వర రావు పనిచేస్తున్నారు. 'మేలెరిగిన మనిషి', 'రైతు సింహాసనం' తదితర పుస్తకాలు వెలువరించారు. బాల సుధాకర మౌళి విజయనగరం జిల్లా మెంటాడ మండలం పోరాం గ్రామంలో జన్మించారు.  ప్రస్తుతం గర్భాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గతంలో 'ఎగరాల్సిన సమయం' కవితా సంపుటి వెలువరించారు.