'చారాణా' కథల సంపుటి ఆవిష్కరణ

తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో ''చారాణా'' వహీద్‌ఖాన్‌ కథలు - పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సెప్టెంబర్‌ 26న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగింది. ఆవిష్కర్త అంపశయ్య నవీన్‌ మాట్లాడుతూ.. రచయిత వహీదఖాన్‌ రాసిన కథలు ప్రస్తుత మన సమాజంలో ఉన్న పరిస్థితులను అద్దంలో చూపుతున్నాయని చెప్పారు. కవి యాకూబ్‌ మాట్లాడుతూ.. ''చారాణా'' కథల వంటి ముగింపు ఈ రోజు సమాజానికి అవసరం అన్నారు. కులం, మతం అంటూ మానవ విలువలు మంట కలుస్తున్న ఈ తరుణంలో ఒక మనిషి ఎలా బతకాలో ఆదర్శవంతంగా చూయించారని తెలియజేశారు. పుస్తక పరిచయకర్త డాక్టర్‌ పరిమళ్‌ మాట్లాడుతూ.. రచయిత పలు అంశాలను, సమస్యలను అభ్యుదయ భావంతో నిశితంగా పరిశీలించారని, ప్రతి కథలో బహుళ అస్తిత్వ, సమస్యలను చర్చించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా వక్తలు మోతుకూరి నరహరి, వల్లభాపురం జనార్దన్‌, రచయిత వహీద్‌ఖాన్‌లు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.